NZ vs Pak Super 8 Match Preview | కఠిన సవాల్ ను ఎదుర్కోనున్న పాకిస్తాన్ జట్టు | ABP Desam
టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ రోజు నుంచి అసలు మజా మొదలు కానుంది. లీగ్ దశలో చిన్న జట్లు ఇచ్చిన షాకులతో బిత్తరపోయిన దిగ్గజ జట్లు...ఇవాళ్టి నుంచి కఠిన సవాల్ ను ఎదుర్కోనున్నాయి. లీగ్ దశను పూర్తి చేసుకున్న టాప్ 8 జట్లు ఇవాళ్టి నుంచి సూపర్ 8 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఇందులో మొదటి అడ్డంకి పాకిస్తాన్ కే ఎదురుకానుంది. ఎందుకంటే ఆ టీమ్ తలపడుతోంది నాణ్యమైన జట్టు న్యూజిలాండ్ తో. సూపర్ 8 గ్రూప్ 2లో ఉన్న పాకిస్తాన్...మిగిలిన జట్లైన ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ మినహా కివీస్, లంక జట్లు అద్భుతమైన ఆటతీరుతో సూపర్ 8కి వచ్చాయి. భారత్ గ్రూప్ 1 లోఉండగా రేపు సౌతాఫ్రికాతో తొలి సూపర్ 8 మ్యాచ్ ను టీమిండియా ఆడనుంది. ఆతర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ లను భారత్ ఢీ కొట్టనుంది. కానీ పాకిస్తాన్ కు సూపర్ 8 మ్యాచ్ లు అంత తేలిక కాదు. లీగ్ దశలో భారత్ కొట్టిన దెబ్బతో కకావికలమైన పాకిస్తాన్ జట్టుపై ఆ టీమ్ ఆటగాళ్లపై మాజీలంతా విరుచుకపడ్డారు. ప్రత్యేకించి అస్సలు ఫామ్ లో లేని బాబర్ ఆజమ్ ను పాకిస్తాన్ ఎందుకు భరిస్తోంది అంటూ మాజీ ప్లేయర్లు మహ్మద్ యూసుఫ్, ఇంజమామ్ లాంటి ఆటగాళ్లంతా ఫైర్ అవుతున్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కోచ్ మైక్ హెసన్ కూడా బాబర్ ను ట్రోల్ చేస్తూ మాట్లాడాడు. పవర్ ప్లేలో బాబర్ స్ట్రైక్ రేట్ 100 కూడా ఉండట్లేదని అందుకనే తనను నాలుగో స్థానంలో ఆడిస్తున్నామని చెప్పాడు. పేసర్లు షాహిన్ అఫ్రిది కి బుమ్రా రేంజ్ బిల్డప్పు ఇచ్చినా తను చేసింది ఏం లేకపోవటంతో కేవలం స్పిన్నర్లను నమ్ముకుని మ్యాచ్ లు ఆడేస్తోంది పాకిస్తాన్. చూడాలి అన్ని విభాగాల్లో బలంగా ఉండే కివీస్ ను ఈరోజు రాత్రికి కొలంబోలో జరిగే మొదటి సూపర్ 8 మ్యాచ్ లో పాకిస్తాన్ ఎలా ఎదుర్కుటుందో.























