Mohammed Siraj 6 Wickets | Eng vs Ind Second test లో సిరాజ్ వీర విజృంభణ | ABP Desam
బుమ్రా లేడంటే చాలు DSP సిరాజ్ డ్యూటీ ఎక్కేస్తాడు. అది అలాంటి ఇలాంటి డ్యూటీ కూడా కాదు. ఆడేది స్వదేశమా..విదేశమా చూడడు. వికెట్ల జాతర జరగాల్సిందే. సిరాజ్ గణాంకాలు చెబుతున్నాయి ఈ సంగతి. ఓ సారి ఈ లిస్ట్ చూడండి. తన కెరీర్ లో నాలుగు సార్లు ఐదు వికెట్లు తీశాడు సిరాజ్. ఈ నాలుగు సార్లు విదేశాల్లో..ఆ నాలుగు సార్లు బుమ్రా లేనప్పుడే కావటం విశేషం. 2020-21 ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెరీర్ లో తొలిసారి టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్ ను సాధించాడు సిరాజ్. బుమ్రా ఆబ్సెన్సీలో పేస్ దళాన్ని లీడ్ చేసిన సిరాజ్ బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా మీద వికెట్లు తీశాడు. తర్వాత 2023లో వెస్టిండీస్ లో వెస్టిండీస్ మీద ఆడుతూ ఐదు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. తిరిగి 2024లో సౌతాఫ్రికాలో సౌతాఫ్రికా మీద కేప్ టౌన్ టెస్టులో 6 వికెట్లు పడగొట్టి తన ప్రతిభ ఏంటో చాటుకున్నాడు. తిరిగి నిన్న బుమ్రా లేని టైమ్ లో బర్మింగ్ హామ్ లో మళ్లీ 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ను కట్టడి చేశాడు. సిరాజ్ ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలే కాదు సిరాజ్ కెరీర్ లో అత్యుత్తమ గణంకాలు చెప్పే వాటిలో చాలా విదేశీ పిచ్ లపైనే సాధించటం నిజంగా విశేషం. బుమ్రా అంత నిలకడగా బౌలింగ్ చేయలేకపోవటం...బుమ్రా అంత ఎక్కువ మ్యాచ్ ఇంపాక్ట్ చూపించలేడనేవి పక్కన పెడితే...టెస్టుల్లో బుమ్రా తర్వాత మన పేస్ దళంలో సిసలైన ఆయుధం సిరాజ్ అని చెప్పటం లో సందేహమే లేదు. ఈ నెంబర్లే ఆ సంగతిని బల్ల గుద్ది మరీ చెప్తున్నాయి.



















