Ind vs Nz 3rd T20I Preview | న్యూజిలాండ్ తో నేడు మూడో టీ20 మ్యాచ్ | ABP Desam
న్యూజిలాండ్ తో ఈరోజు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 మ్యాచుల ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే మొదటి రెండు మ్యాచుల్లోనూ రఫ్పాడించి జయకేతనం ఎగురేసింది. ఇక ఇవాళ గువాహటి లో జరిగే మూడో మ్యాచ్ ను కూడా గెలిచేస్తే భారత్ సిరీస్ గెలిచినట్లే కాబట్టి కచ్చితంగా గెలవాలని టీమిండియా...అడ్డుకోవాలని న్యూజిలాండ్ కసిగా ఉన్నాయి. ఫస్ట్ రెండు మ్యాచులు చూస్తే మనం బలం నిజంగా బ్యాటర్లే. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సహా అందరూ ఫామ్ లోకి వచ్చేయటం టీ20 వరల్డ్ కప్ కి ముందు భారత్ కు పెద్ద అడ్వాంటేజ్. ఒక్క సంజూ శాంసన్ మాత్రమే ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. మిగిలిన వాళ్లంతా దాదాపుగా దుమ్మురేపుతున్నారు. ఇవాళ కూడా మరోసారి చెలరేగాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇక బౌలింగ్ లో ఈ మ్యాచ్ కు అర్ష్ దీప్ కి రెస్ట్ దొరికే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న పాజీని తప్పించి బుమ్రాను ఫైనల్ ఎలెవన్ లో ఆడించేదుకు స్కోప్ ఉంది. ఇక మ్యాచ్ లు గెలవకపోయినా న్యూజిలాండ్ ను టీ20 ఫార్మాట్ లో అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఇప్పటికే టెస్టులు, వన్డే సిరీస్ లను మన దేశంలోనే మనల్ని ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆ జట్టు భారత్ ఏ చిన్నపాటి లూజ్ ఎండ్ ఇచ్చినా మిగిలిన మూడు మ్యాచులు సునాయాసంగా మన నుంచి లాగేయగల సమర్థత ఉన్న జట్టు అది. డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్, రచిన్, గ్లెన్ ఫిలిఫ్స్ మంచి టచ్ లో ఉన్నారు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అటు బ్యాటింగ్ లోనూ దుమ్మురేపుతున్నాడు. ఇటు బౌలింగ్ లోనూ ఇష్ సోధితో కలిసి భారత్ ను అడ్డుకునే యత్నం చేస్తున్నాడు. ఎటొచ్చి వాళ్ల పేసర్లు చెలరేగితే చాలు..భారత్ విజయాల పరంపరకు బ్రేక్ వేయొచ్చని కివీస్ భావిస్తోంది. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో న్యూజిలాండ్ కమ్ బ్యాక్ ఇస్తుందో లేదా మనోళ్లు మూడోది కూడా గెలిచి కివీస్ ను మడతపెట్టేస్తారో





















