Eng vs Ind Lords test Match Highlights | మళ్లీ రాహుల్ దేవుడిలా ఆదుకుంటాడా..పంత్ బాబు సహకరిస్తాడా | ABP Desam
టెస్ట్ మ్యాచ్ లో ఉండే మజా ఏంటో చూపిస్తోంది లార్డ్స్ మ్యాచ్. ఇంగ్లండ్, భారత్ ల మధ్య జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే రెండు జట్లు 1-1 తో సరిసమానంగా ఉన్నాయి. ఇక మూడో టెస్టు గెలిచిన వాళ్లు ఐదు మ్యాచుల సిరీస్ లో లీడ్ కి వెళ్తారు. సో ఆ ఆధిక్యం కోసం రెండు జట్లు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఎప్పుడూ బాజ్ బాల్ అని దూకుడైన ఆటతీరును ప్రదర్శించే ఇంగ్లండ్ భారత బౌలర్లకు భయపడింది అనేది మాత్రం వాస్తవం. అందుకే తమ స్టైల్ మార్చి లార్డ్స్ లో జిడ్డు ఆట ఆడారు. మూడు రోజులు ముగిసే సరికి భారత్, ఇంగ్లండ్ రెండు జట్లూ కూడా సరి సమానంగా ఉన్నాయి. సో ఇక ఏం తేల్చుకున్నా రెండు రోజుల్లో తేల్చుకోవాలన్న అన్న టైమ్ లో నిన్న భారత బౌలర్లు చెలరేగిపోయారు. నాలుగో రోజు ప్రారంభం కాగానే సిరాజ్ మియా షో ప్రారంభమైంది. డకెట్ ను, ఓలీ పోప్ ను సిరాజ్ పెవిలియన్ కు పంపించాడు. జాక్ క్రాలీని నితీశ్ రెడ్డి అవుట్ చేస్తే...హ్యారీ బ్రూక్ ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఇక్కడ కాసేపు వికెట్ల పతనానికి బ్రేక్ వేశారు జో రూట్ అండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. లంచ్ వరకూ ఆ తర్వాత భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని రూట్ 40పరుగులు, స్టోక్స్ 33 పరుగులు చేస్తే..అప్పుడు ఇక రంగంలోకి వాషింగ్టన్ సుందర్. రూట్, స్టోక్స్, హాఫ్ సెంచరీలతో చిరాకు తెప్పించే కీపర్ జెమీ స్మిత్, షోయబ్ బషీర్ నలుగురినీ క్లీన్ బౌల్డ్ చేసి లార్డ్స్ టెస్టును భారత చేతుల్లోకి తెచ్చేశాడు. ఫుల్ మాస్ సినిమా అసలు. ఇంగ్లండ్ ను అల్లాడించాడు సుందర్. థ్రిల్లర్ సినిమా చూపించాడు. ఇక తనదైన శైలిలో యార్కర్లు విసిరిన బుమ్రా క్రిస్ వోక్స్ ను, బ్రైడాన్ కార్సేను బౌల్డ్ చేస్తే...ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఆలౌట్ అయ్యి టీమిండియా 193పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు ఏమన్నా తక్కువ వాళ్లా ఆర్చర్ జైశ్వాల్ ను దొరకబుచ్చుకుంటే...బ్రైడాన్ కార్సే కరుణ్ నాయర్ ను, శుభ్ మన్ గిల్ ను ఎల్బీ చేశాడు. ఇక రోజులో చివరి బంతికి స్టోక్స్ ఆకాశ్ దీప్ ను ఔట్ చేయటంతో భారత్ 4వికెట్ల నష్టానికి 58పరుగులు చేసింది. ఇక భారత్ గెలవాలంటే 135పరుగులు చేయాలి. రాహుల్ కి తోడుగా పంత్ లాంటి పోరాట యోధుడు, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. కానీ మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ కి ఇవాళ నరాలు తెగిపోవటం ఖాయం. ఎందుకంటే అటు ఇంగ్లండ్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేం..మన బ్యాటర్ల ప్రతిభను తప్పు పట్టలేం. చూడాలి నరాలతో గిటార్ వాయిస్తున్న లార్డ్స్ టెస్టులో విన్నర్ ఎవరో.





















