Eng vs Ind Lords test Day 5 Highlights | ఉత్కంఠ భరిత లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ విజయం | ABP Desam
అదృష్టం...పోరాటానికి, పోరాటానికి మధ్యలో ఇదే మిగిలింది. ఆ అదృష్టం ఇంగ్లండ్ పోరాటం వైపు వెళ్లింది కాబట్టి టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా చేసిన అద్భుత పోరాటం వృథాగా మిగిలిపోయింది. 193 పరుగుల చిన్న లక్ష్యం..కానీ కేఎల్ రాహుల్ తప్ప మరో బ్యాటర్ నిలబడలేకపోయిన పరిస్థితుల్లో ఐదో రోజు ఆటలో ఆసాంతం భారత్ పీకల్లోతు కష్టాల్లోనే కనిపించింది. అసలు ఓ దశలో 82పరుగులకే 7వికెట్లు కోల్పోయి దారుణమైన ఓటమి తప్పదు అనిపించినా...జడేజా టెయిలెండర్లను అడ్డం పెట్టుకుని అద్భుతంగా పోరాడాడు. ముందు నితీశ్ 53 బాల్స్ ఆడి 13పరుగులు చేస్తే..ఆ తర్వాత అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజా మొదలైంది. జస్ ప్రీత్ బుమ్రా పట్టువదలని విక్రమార్కుడిలా ఆడాడు. 54 బంతులు కేవలం ఐదు పరుగులే చేసి జడ్డూ స్ట్రైక్ ఇస్తూ బుమ్రా ఆడిన ఆట అద్భుతం కంటే ఎక్కువే అని చెప్పాలి. సరే బుమ్రా వికెట్టూ తీసుకున్నారు. ఇక సిరాజ్ మియా ను లేపేస్తే జడ్డూనూ నాన్ స్ట్రైక్ లో పెట్టి మ్యాచ్ గెలుచుకోవచ్చు. కానీ డీఎస్పీ సాబ్ వదిలి పెట్టలేదు. 30 బంతులు ఆడి 4 పరుగులు చేసిన మియా...ఆల్మోస్ట్ భారత్ ను గెలుపు దిశగా జడ్డూ నడిపించేందుకు కావాల్సినంత సహకరించాడు. కానీ షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఢిపెన్స్ ఆడేసి వదిలేసిన బంతి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్లి స్టంప్స్ తగటం బెయిల్ కిందపడటంతో భారత్ 170పరుగులకు ఆలౌట్ అయ్యింది. కానీ బుమ్రాను, సిరాజ్ ను అడ్డుపెట్టుకుని ఓపిక సహనంతో టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చెప్పిన జడేజా 181 బంతులు ఆడి 4ఫోర్లు ఓ సిక్సర్ తో 61 పరుగులు చేశాడు. మరొక్క 23పరుగులు చేస్తే లార్డ్స్ టెస్టులో భారత జెండా ఎగరొచ్చన్న టైమ్ లో సిరాజ్ మియా అవుట్ అవ్వటంతో జడ్డూ భాయ్ పోరాటం వృథాగా మిగిలిపోయింది. కానీ ఏ మాటకు ఆ మాట అసలు జీవం లేని పిచ్ లో అంత తక్కువ టార్గెట్ పెట్టుకుని ఇంగ్లండ్ బౌలర్లు కష్టపడిన విధానం...హ్యాట్సాఫ్ అసలు. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 లీడ్ లోకి వెళ్లింది. ఇక మిగిలిన రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తేనే ఈ సిరీస్ మనకు దక్కుతుంది.





















