Aus vs Ind 1st ODI Highlights | భారత్ పై మొదటి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం | ABP Desam
వాన ఆడుకుంది. మాములుగా కాదు. ఐదారు సార్లు అడ్డంకులే అడ్డంకులు. పెర్త్ పిచ్ పై టాస్ ఓడి భారత్ ఏమంటూ బ్యాటింగ్ కి దిగిందో కానీ వరుణుడు డిస్ట్రబ్ చేస్తూనే ఉన్నాడు. మరో వైపు ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే మనోళ్లు వికెట్లు సమర్పించుకుంటుంటే..మధ్యలో వర్షం వచ్చి ఓవర్లు కరుగుతుంటే...పోనీ మ్యాచ్ మొత్తం తుడిచి పెట్టుకోపాయినా బాగుండు అనిపించింది ఓ టైమ్ లో. అయినా లక్ కలిసి వస్తేనే కదా. మొత్తంగా ఆసీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా భారత్ ను వెంటాడుతూ వేటాడుతూ ఆస్ట్రేలియా మొదటి వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత్ 9వికెట్ల నష్టానికి 136పరుగులు చేసింది. రాహుల్ 38, అక్షర్ 31పరుగులు చేశారు కాబట్టి సరిపోయింది కానీ మిగిలిన వాళ్లంతా ఘోరం. పట్టుమని ఎవ్వరూ 20పరుగులు కూడా చేయలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొహ్లీ డకౌట్ అవుట్ అయితే, రోహిత్ శర్మ 8పరుగులే చేశాడు. మధ్య మధ్యలో వర్షం అంతరాయాలు వెరసి భారత్ అంతకంటే ఎక్కువ కొట్టలేకపోయింది. హేజిల్ వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మనం చేసిందే తక్కువ స్కోరంటే రిఫరీ మరో ఐదు పరుగులు తగ్గించి ఆస్ట్రేలియాకు 131 టార్గెట్ ఇచ్చారు. ట్రావియెస్ హెడ్, మాథ్యూ షార్ట్ వికెట్లు భారత్ త్వరగానే తీసినా కెప్టెన్ మిచ్ మార్ష్ భారం అంతా మీదేసుకున్నాడు. కీపర్ జోష్ ఫిలిప్, మ్యాట్ రెన్ షా తో కలిసి ఆసీస్ కు కావాల్సిన టార్గెట్ ఛేజ్ చేసి పెట్టాడు. మిచ్ మార్ష్ 46పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే...ఫిలిప్ 37పరుగులు చేస్తే, రెన్ షా 21పరుగులతో నాటౌట్ గా ఉండి ఫినిషింగ్ ఇవ్వటంతో ఆసీస్ 7వికెట్ల తేడాతో గెలిచేసింది. అర్ష్ దీప్, అక్షర్, సుందర్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 లీడ్ లోకి వెళ్లింది. భారత్ ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు వన్డేల్లో విజృంభించాల్సిందే.





















