Shubhanshu Shukla biography | రాకేశ్ శర్మ తర్వాత స్పేస్ లోకి వెళ్తున్న శుభాన్షు శుక్లా ఎవరంటే.? | ABP Desam
జూన్ 10న ఏక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లా..స్పేస్ లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. 1984 లో రాకేశ్ శర్మ స్పేస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పగా ఆ తర్వాత 41 సంవత్సరాల మళ్లీ మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లటం ఇదే తొలిసారి. మరి అంతటి ఘనత సాధిస్తున్న ఇస్రో వ్యోమనాట్ శుభాన్షు శుక్లా అసలు ఎవరు..ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటీ...ఆయన ఎలా ఇస్రోకి వచ్చారు..ఇప్పుడు నాసా ఏక్సియం ద్వారా స్పేస్ లోకి ఎందుకు వెళ్తున్నారు తెలుసుకుందాం.
నిన్న మొన్నటి వరకూ రాకెట్ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..ఇప్పుడు సొంతంగా అంతరిక్షంపై ప్రయోగాలు చేసే స్థాయికి చేరుకుంది. మనిషి బతకటానికి కేవలం భూమి మాత్రమే ఆధారమా..ఇంత విశాల విశ్వంలో మరే చోటు మానవ మనుగడకు సహకరించదా. అంతులేని ఈ ప్రశ్నలను చేధించాలని సిద్ధమైన ఇస్రో శాస్త్రవేత్తలు వేయాలనుకుంటున్న తొలి అడుగే గగన్ యాన్. ఇప్పటి వరకూ మన ప్రయోగాలన్నీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టం వరకే పరిమితమయ్యాయి. రాకేశ్ శర్మ తొలిసారిగా స్పేస్ లోకి వెళ్లినా ఆయన వెళ్లింది రష్యా రాస్ కాస్మోస్ సహకారంతో. మళ్లీ 41ఏళ్ల తర్వాత ఇప్పుడు శుభాన్షు శుక్లా స్పేస్ లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తున్నా ఆయన కూడా నాసా, ఆక్సియం, స్పేస్ ఎక్స్ సంస్థ కలిసి నిర్వహిస్తున్న ఆక్సియం 4 మిషన్ లో భాగంగా వెళ్తున్నారు. అయినా ఈ ప్రయాణం వెనుక ఉద్దేశం 2027లో ఇస్రో నిర్వహించబోయే గగన్ యాన్ నిర్వహణకు మన వ్యోమనాట్స్ కి కావాల్సిన అనుభవాన్ని సాధించటం కోసమే. అందుకే శుభాన్షు శుక్లాను ఆక్సియం 4 మిషన్ లో భాగం చేసింది ఇస్రో. మిషన్ పైలెట్ గా శుభాన్షును పంపిస్తూ నాసాతో ఒప్పందం కుదుర్చుకుంది. అలా శుభాన్షు శుక్లా స్పేస్ లోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంటున్నారు.
ఉత్తప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభాన్షు శుక్లా వయస్సు 39 సంవత్సరాలు. ఆయన తండ్రి శంభు దయాల్ శుక్లా, తల్లి ఆశా శుక్లా. శంభు దయాల్ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేశారు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన శుభాన్షు చిన్నప్పటి నుంచి చదువుల్లో టాపర్ గానే ఉండేవాడు. ముగ్గురు పిల్లలతో మధ్యతరగతి జీవితం గడిపిన శంభు దయాల్ శుభాన్షు ను చదువుకున్నంత చదివించారు. డిగ్రీ చదువుతున్నప్పుడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోటీ పరీక్షలకు హాజరై సెలెక్ట్ అయిన శుభాన్షు 2005లో ఢిల్లీ జేఎన్ యూ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఐఐఎస్సీ బెంగుళూరు నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కి సెలెక్ట్ అయ్యి 2006 ఫ్లైయింగ్ బ్రాంచ్ లో సభ్యుడిగా పైలెట్ ట్రైనింగ్ పూర్తి చేశారు. తర్వాత జూనియర్ ర్యాంక్ ఫ్లైయింగ్ ఆఫీసర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తన బాధ్యతలను ప్రారంభించారు శుభాన్షు శుక్లా.
తన కెరీర్ లో ఇప్పటివరకూ యుద్ధవిమానాలు నడపటంలో విశేషమైన అనుభవాన్ని సంపాదించారు శుభాన్షు. రెండు వేల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. సుఖోయ్ యుద్ధవిమానం, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, ఏంటనోవ్, డోర్నియర్ ఇలా వేర్వేరు ఎయిర్ ఫోర్స్ విమానాలను నడిపి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు శుభాన్షు. 2019లో ఆస్ట్రోనాట్స్ ఎంపిక పరీక్షలకు హాజరై వేల మంది పైలెట్స్ లో అర్హత సాధించిన శుభాన్షు 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పెస్ మెడిసిన్ కు ఆస్ట్రోనాట్ గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కఠినమైన పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసి ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఎంపిక చేసిన తుది నలుగురు ఆస్ట్రోనాట్స్ లో ఒకరిగా నిలిచారు వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇస్రోకు ఆస్ట్రోనాట్స్ గా సెలెక్ట్ అిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ,గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా పేర్లను ప్రధాని మోదీ గగన్ యాన్ వ్యోమనాట్స్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ నలుగురికి ప్రధాని మోదీ నే ఇస్రో గగన్ యాన్ బ్యాడ్జెస్ ను ధరింప చేశారు. అలా శుభాన్షు ప్రయాణం ఇస్రో తో మొదలైంది. శుభాన్షుతో పాటు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను ఆక్సియం 4 మిషన్ కు బ్యాకప్ పైలెట్ గా ఎంపిక చేశారు. జూన్ 10 ప్రయాణంలో పు ఆక్సియంలో 4 లో వెళ్లే నలుగురు ఆస్ట్రోనాట్స్ కి ఆరోగ్యపరంగా ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే బాలకృష్ణన్ నాయర్ కూడా స్పేస్ లోకి వెళ్తారు. శుభాన్షు శుక్లా సాధించిన ఈ ఘనతల పట్ల ఆయన తల్లితండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇది చదవమని మేమెప్పుడూ ఒత్తిడి చేయలేదని తనతంట తనే ఎయిర్ ఫోర్స్ కు సెలెక్ట్ అయ్యాడని..ఇప్పుడు ఇస్రో ద్వారా అంతరిక్షంలో వెళ్తున్న రెండో భారతీయ ఆస్ట్రోనాట్ కావటం తమకు గర్వకారణంగా ఉందంటున్నారు..శుభాన్షు తల్లి తండ్రులు
డా. కామ్నా అనే డెంటిస్ట్ ను వివాహం చేసుకున్న శుభాన్షు, కామ్నాలకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. పుస్తకాలు చదవటం..జిమ్ లో గడపటం..స్పైస్ సైన్స్ గురించి తెలుసుకోవటం శుభాన్షు హాబీలు కాగా...తనను Agnostic అని చెప్పుకుంటారు శుభాన్షు. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేకపోవటం..అలా అని ఈ విశ్వాన్ని శక్తి ఏదీ లేదు అని కొట్టిపారేయని ఓ స్థితి. దేవుడు ఉన్నా లేకున్నా పెద్ద తేడా అని లేదు అని శుభాన్షు శుక్లా నమ్ముతారు.





















