ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన
మన భారత్‌లో తొలిసారిగా జరగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో రామ్ చరణ్.. భార్య ఉపాసనతో పాటు ఆమె తండ్రి అనిల్ కామినేనితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రధానితో రామ్ చరణ్ ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ప్రధాని మోదీని కలవడం ఎంతో గౌరవంగా అనిపించిందన్నారాయన. స్పోర్ట్స్ విషయంలో ప్రధానమంత్రికి ఉన్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం ఆర్చరీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవడానికి, మరింతగా అభివృద్ధి చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపిన రామ్ చరణ్.. మరెంతో మంది ఈ అద్భుతమైన క్రీడలో పాల్గొని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ లీగ్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని తండ్రి అనిల్ కామినేని ఆధ్వర్యంలో జరగబోతోంది.





















