కొత్త చరిత్ర మొదలు కాబోతోంది.. స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోండి: పీఎం మోదీ
సెప్టెంబరు 22 సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ (GST) ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. జీఎస్టీలో కొత్తగా వచ్చిన మార్పులు ఎన్నో రంగాలకు ఉపయోగపడతాయన్న మోదీ.. ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సోమవారం నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతుండటంతో ఈ రోజు ఆదివారం మోదీ.. జాతినుద్దేశించి ప్రసంగించారు.
ముందుగా దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికీ మేలు జరుగుతుందని, దీనివల్ల ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతం లభించి.. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదపడుతుందని అన్నారాయన. ‘‘ఒకప్పుడు రకరకాల పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ద్వారా కొత్త అధ్యాయం మొదలైంది.
ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ సిస్టమ్‌ని మరింత సింప్లిఫై చేసి.. దేశంలోని అన్ని వర్గాలతోనూ చర్చించి సరికొత్త సంస్కరణలు తెచ్చాం. రేపటి నుంచి జీఎస్టీలో కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. జీఎస్టీ సవరణలతో ఇప్పటివరకు 12శాతం పరిధిలో ఉన్న 99శాతం వస్తువులు 5శాతం పరిధిలోకి వచ్చాయి. దీంతో ఇకపై నిత్యావసర వస్తువల ధరలు కూడా తగ్గుతాయి. ఎల్‌ఐసీ, మెడిసిన్స్ ధరలు కూడా తగ్గుతాయి. ఈ మార్పులతో వస్తు రవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. పెట్టుబడుల పెరుగుతాయి.
ప్రజల పొదుపు పెరుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఇక చివరిగా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలని దేశ ప్రజకి పిలుపునిచ్చారాయన. మన రోజూవారీ జీవితంలో విదేశీ వస్తువులని ఎక్కువగా వాడుతున్నామని, వాటి వాడకాన్ని తగ్గించి.. భారత్‌లో తయారై వస్తువులనే వినియోగించడానికి మొగ్గు చూపాలని, ప్రతి పౌరుడూ స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని మోదీ కోరారు.





















