Kid Rescue by Pune Fire Fighter | మూడో అంతస్తు నుంచి ఊచలు పట్టుకుని వేలాడిన పసిపాప | ABP Desam
నాలుగేళ్ల పసిపాప కిటీకి ఊచలు పట్టుకుని వేలాడుతుంది. అది కూడా మూడు అంతస్తుల హైట్ నుంచి వేలాడుతోంది. కింద నుంచి చూసిన ఆ పాప తల్లి గుండె ఆగిపోయినంత పనైంది. పెద్దగా కేకలు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది. ఈలోగా ఓ ఫైర్ ఫైటర్ దేవుడిలా వచ్చాడు. పరుగు పరుగున మూడు అంతస్తులు ఎక్కాడు. అయితే తాళం వేసి ఉండటంతో మళ్లీ కిందకు వచ్చి ఆ తల్లి దగ్గర తాళం తీసుకుని వెళ్లి ఆ పసిపాపను అతి జాగ్రత్తగా పట్టుకుని లోపలకి లాగి తన ప్రాణాలు కాపాడాడు. నాలుగేళ్ల ఈ పాప పేరు భావిక కాగా ఆమె తల్లి తన పెద్దకూతురుని స్కూల్ ఆటో ఎక్కించటానికి వెళ్తూ ఈ చిన్న పాపను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని కిందకు వెళ్లింది. అయితే ఈ గ్యాప్ లో ఆ చిన్నపాప కిటీకి ఎక్కేయటం...తల్లి, అక్క కోసం చూస్తూ చేతులు కాళ్లు బయటకి పెట్టి ఊచలు పట్టుకుని అంతెత్తు నుంచి వేలాడటం జరిగిపోయాయి. తల్లి అరుపులకు యోగేష్ చవాన్ అనే ఈ ఫైర్ ఫైటర్ వేగంగా స్పందించటంతో ఆ పసిపాప అదృష్ట వశాత్తూ ప్రాణాలు దక్కించుకుంది. పుణేలోని గుజర్ నింబాల్కర్ వాడి ఏరియాలోని సోనా వానే బిల్డింగ్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





















