Ashes: సిసలైన క్రికెట్ అంటే టెస్ట్ ఫార్మాట్ అని మళ్లీ ప్రూవ్ అయింది
టెస్టు క్రికెట్ లో ఉన్న గొప్పతనం, ఆ మజాను ఆసీస్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మరోసారి రుజువు చేసింది. టీ 20 క్రికెట్ లో ఉన్నట్టు ఎడాపెడా బౌండరీలు, అన్ కన్వెన్షనల్ షాట్లు లేవు. నాణ్యమైన బౌలింగ్ ను కాచుకుంటూ టెస్టును కాపాడుకున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. 388 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్.. ఐదో రోజు ఆఖరి బంతి వరకు శ్రమించి అతికష్టం మీద మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఐదు టెస్టుల ప్రతిష్ఠాత్మక యాషెస్ ను ఇప్పటికే 3-0తో కోల్పోయిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడం ద్వారా ఆఖరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా సిరీస్ క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. ఐదో రోజు ఆట చివరి నిమిషాల్లో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆస్ట్రేలియా కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అప్పటికే 8 వికెట్లు పడగా... పార్ట్ టైమర్ గా వచ్చిన స్టీవ్ స్మిత్ 9వ వికెట్ తీశాడు. ఆసీస్ ఇది కూడా గెలిచేస్తుందని అనుకున్నారంతా. కానీ ఆఖరి 2 ఓవర్లను బ్రాడ్, అండర్సన్ కాచుకుని మ్యాచ్ ను డ్రాగా ముగించారు.