YS Jagan Name in AP Liquor Charge Sheet | ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ పేరు | ABP Desam
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఏపీ మద్యం కుంభకోణం కీలక మలుపులు తిరిగింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డిని శనివారం ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు రాత్రికి ఆయన అరెస్టును ప్రకటించారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ లో అనేక సార్లు మాజీ సీఎం జగన్ పేరు ను ప్రస్తావించారు సిట్ అధికారులు. 305పేజీల ఛార్జ్ షీట్ లో వేల కొద్దీ అడిషనల్ డాక్యుమెంట్స్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చూపించిన అధికారులు...ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఆవశ్యకతను న్యాయమూర్తికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో కొత్తగా 8మంది నిందితులను చేర్చిన సిట్ అధికారులు..మొత్తం 16మంది పాత్రపై అభియోగాలు మోపింది. మిథున్ ను ఏ4గా చేర్చింది. దోపిడీకి వీలుగా నూతన మద్య విధానం రూపొందించి..అందులో ఏయే డిస్టలరీస్ నుంచి ఎంత మొత్తం ముడుపులు రావాలి అనే స్కెచ్ కు మాస్టర్ మైండ్ గా మిథున్ రెడ్డిని పేర్కొన్న సిట్ అధికారులు..ఆయనకు సంబంధించిన వ్యక్తుల దగ్గరే డిస్టలరీస్ ఉండటంతో పెద్దిరెడ్డి కుటుంబం రెండు విధాలా లబ్ది పొందినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలన్నీ బిగ్ బాస్ జగన్ కు తెలుసంటూ అక్కడక్కడా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావన చేశారు. కానీ ఛార్జ్ షీట్ లో జగన్ ను ఎక్కడా నిందితుడిగా చేర్చలేదు. ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకూ రాజ్ కసిరెడ్డి అరెస్ట్ నుంచి మొదలుపెడితే...రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ తో కుంభకోణంలో ఇప్పటివరకూ 12మంది అరెస్ట్ అయ్యారు.





















