Handri Neeva Lift Irrigation Project | హంద్రీనీవా ఫేజ్-1 కాలువల పనులు పూర్తి | ABP Desam
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల సామర్థ్యం పెంపుతో రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం రోజు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద నీటిని విడుదల చేస్తారు సీఎం చంద్రబాబు. ముందు ప్రకటించినట్టుగానే వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. 696 కోట్లతో చేపట్టిన పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించే అవకాశం దక్కింది. జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరనుంది. మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్లకుపైగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. HNSS ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల అవసరాలు తీర్చనున్నాయి.





















