చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్
తిరుమల లడ్డు ప్రసాదంలో...జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. అలాంటి తప్పేమీ జరగలేదని వైసీపీ తేల్చి చెబుతున్న క్రమంలోనే...ప్రస్తుత ప్రభుత్నం ఆధారాలతో సహా అంతా బయటపెట్టింది. అయితే...ఈ వివాదంపై ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి ఎంతో ఆవేదన చెందానని చెప్పారు. వైసీపీ హయంలోని టీటీడీ బోర్డుపై విచారణ జరిపించి తీరాలని అన్నారు. బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకోడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు ప్రత్యేకంగా సనానత ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ బోర్డు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే ఈ వివాదంపై మండి పడుతున్న వైసీపీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొంది.