Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Telangana News: పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చినా ఆ అభ్యర్థి పట్టు వీడలేదు. నొప్పులు భరిస్తూనే పరీక్షను పూర్తి చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.
Woman Wrote Group 2 Exam With Birth Pangs In Nagarkurnool: ఓ అభ్యర్థి పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో (Nagarkurnool District) చోటు చేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి.. నాగర్‌కర్నూల్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన సెంటర్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అందుకు ఆమె అంగీకరించకుండా పరీక్ష రాస్తానని చెప్పారు. కాన్పు తేదీ సైతం సోమవారమే కావడంతో పరీక్షా కేంద్రం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
కలెక్టర్ ఆదేశాలతో..
సదరు అభ్యర్థి పట్టు వదలకుండా పరీక్షా రాస్తానని చెప్పడంతో.. అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. ఆమెకు ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం చేశారు. రేవతి భర్త, ఆమె తల్లి కూడా అందుబాటులో ఉన్నారు. కాగా, నొప్పులతోనే ఆమె పరీక్ష పూర్తి చేశారు.