ఇళయరాజాకు ఘోర అవమానం!
ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రముఖ ఆలయంలో అవమానం ఎదురైంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. మార్గశిర తొలిరోజు ఆండాళ్ ను దర్శించుకునేందుకు తెల్లవారుజామున శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి ఇళయరాజా వెళ్లారు. స్వామివారి దర్శనం కోసం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపంలోకి ఇళయరాజా ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న జీయర్ స్వాములు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అర్థ మండపం మెట్ల దగ్గరే నిలబడి ఇళయరాజా ఆలయ మర్యాదలను స్వీకరించాల్సి వచ్చింది. ఇలా శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి సంగీత విద్వాంసుడు ఇళయరాజాను రానివ్వక పోవడం కలకలం సృష్టించింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లకు పైగా తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈ సంగీతకారుడు ఇళయరాజా తమిళనాడులోని తేని జిల్లాలో ఒక దళిత కుటుంబంలో 1943 జూన్ 3న పుట్టారు.