Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Indore News: భిక్షాటన పూర్తిగా నిషేధించడం సహా యాచకులకు డబ్బులిచ్చే వారిపైనా చర్యలకు ఇండోర్ అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి 1 నుంచి నిబంధనలు అమలు చేయనున్నారు.
Begging Banned In Indore City: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని (Indore City) యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను పూర్తిగా నిషేధించగా.. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసే వారికి డబ్బులిచ్చే వారిపైనా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తామని.. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'నగరాన్ని పూర్తిగా యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే డిసెంబర్ చివరి వరకూ వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. జనవరి 1వ తేదీ నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తాం.' అని ఇండోర్ కలెక్టర్ ఆశిశ్ సింగ్ చెప్పారు. భిక్షాటన చేస్తోన్న వారికి ఎలాంటి సాయం చెయ్యొద్దని.. వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.
10 నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్
కేంద్ర సామాజిక, న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ.. యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 10 నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇండోర్ అధికారులు భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించి షాకింగ్ విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని.. మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని ఈ వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని ప్రాజెక్ట్ అధికారి దినేశ్ మిశ్రా పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు తావు లేకుండా ఉండేందుకే చర్యలు చేపట్టామని.. భిక్షాటన చేసే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు.
Also Read: Gukesh: గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్