YS Sharmila: స్టాండప్ బీసీ నినాదంతో పనిచేస్తాం... కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు బీసీలకు మాత్రం కులవృత్తులా... బీసీ ఆత్మగౌరవ సభలో వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చి వాళ్లను చదువుకు దూరం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో బీసీలకు న్యాయం జరగడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రపంచ తీరు మారుతుంటే బీసీలను మాత్రం కులవృత్తులకే పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభలో షర్మిల పాల్గొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అధ్వానంగా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసిందేంలేదన్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు.
బీసీ గౌరవసభ* కోస్గి కి భారీగా తరలి వచ్చిన షర్మిలమ్మ సైనికులు... ❤🔥@realyssharmila #chalokosgi pic.twitter.com/5fB4NoPXzf
— YSR TELANGANA PARTY (@YSRTelangana) October 3, 2021
Also Read: ఖబడ్దార్ కేసీఆర్! నీ దొర పోకడలు సాగనివ్వను, నీ మెదడు మత్తుతో మొద్దుబారిందా? వైఎస్ షర్మిల ధ్వజం
చేప పిల్లలు ఇస్తే రాజులైనట్టేనా?
తెలంగాణలో పాలకులే బీసీలను ఎదగకుండా అడ్డుకుంటున్నారని షర్మిల విమర్శించారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చి వాళ్లను చదువులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు. దళిత బంధులాగా బీసీ బంధు ప్రకటిస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేవలం రూ.2వేల పింఛన్లతో నేతన్నలు యజమానులు అవుతారా అని ప్రశ్నించారు. మదిరాజ్లను రాజులను చేస్తా అన్న కేసీఆర్.. చేప పిల్లలు ఇస్తే రాజులైనట్టేనా అన్నారు. ఉపఎన్నిక కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు పథకాలు ప్రకటిస్తున్నారని షర్మిల ఆరోపించారు.
Also Read: చేవెళ్ల టు చేవెళ్ల ... అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర
స్టాండప్ బీసీ నినాదం
కులవృత్తులను చేసుకొని బతకండనే నాయకులను ప్రశ్నించాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రపంచం ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే బీసీలు మాత్రం కులవృత్తులకే పరిమితం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాలనలో బీసీలకు పెద్ద పీట వేశారని ఆమె చెప్పారు. చట్టసభల్లో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంబీసీలకు రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించింది. అసెంబ్లీలో బీసీలు 20 శాతం కూడా లేరన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక శాతం బీసీలకే కేటాయిస్తుందని షర్మిల హామీఇచ్చారు. స్టాండప్ బీసీ అనే నినాదంతో పనిచేస్తామన్నారు. బీసీలను స్వయం సమృద్ధి చేయడమే తమ లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు.