YS Sharmila : ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !
తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తనతో సంబంధం లేదని సజ్జల వ్యాఖ్యానించడంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏం సంబంధం ఉందని తాను వైఎస్ఆర్‌సీపీకి శక్తికి మించి పని చేశానని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్న మాట నిజమే కానీ అవి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవేవని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయని ఆమె నర్మగర్భంగా ఏబీఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వ్యాపారాల్లో తనకూ భాగం ఉందని.. ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : నేటి చీఫ్ సెక్రటరీలు రేపటి సలహాదారులు ! ఏ సేవలకు ఈ ప్రతిఫలాలు ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల నేపధ్యంలో సోదరుడికి శిక్ష పడితే ఎవరు సీఎం అవుతారో తనకు సంబంధం లేదని షర్మిల స్పష్టం చేశారు. తద్వారా ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితమని ఆమె స్పష్టత ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల ప్రకారం ఆ పార్టీ నేతలే తమ నేతను ఎంచుకుంటారని వ్యాఖ్యానించారు. అందరి కుటుంబాల్లోనూ వివాదాలు ఉంటాయని అలానే తమ కుటుంబంలోనూ ఉన్నాయన్నారు.
Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?
తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం శక్తికి మించి పని చేశానని కానీ ఇప్పుడు వారికి తన అవసరం లేదని ఆమె నిరాశ వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది తన నిర్ణయమని అందుకే సొంత పార్టీ పెట్టుకున్నానన్నారు. పార్టీ విషయంపై చర్చలు జరిపినప్పుడు జగన్ వద్దన్నారని అయినా తన నిర్ణయం తాను తీసుకున్నానని షర్మిల స్పష్టం చేశారు. పార్టీ పెట్టి మొదట్ అడుగు వేసిన రోజునే సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల పార్టీతో తమకేం సంబంధం లేదని ప్రకటించిన అంశంపై ఆమె ఆవేదనతో స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వారు ఏమి అడిగినా పాదయాత్రతో సహా నేను శక్తికి మించి చేశానన్నారు. ఏం సంబంధం ఉందని చేశానని కాస్త ఆవేదనా స్వరంతో ఆమె ప్రశ్నించారు. దానికి తగ్గట్లుగానే వైఎస్ఆర్ సీపీలో తాను ఎప్పుడూ సభ్యురాలిని కాదు. ఏ పదవి తీసుకోలేదు. వారికి అవసరమైనప్పుడు సాయం అడిగారు. నేను చేశానని తేల్చేశారు. ఇప్పుడు తన అవసరం వారికి లేదన్నారు.
Also Read : స్వరూపానంద వ్యతిరేకత ! ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ?
కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా షర్మిల పంచుకున్నారు. పిల్లల గురించి.. భర్త రాజకీయ ప్రోత్సాహం గురించి ప్రకటించారు. అలాగే అనిల్ తో తన పెళ్లి గురించి కూడా చెప్పారు. అనిల్‌తో పెళ్లికి నాన్న అంగీకరించలేదు. వద్దని చెప్పడానికి చాలా నచ్చ చెప్పినా తాను వినలేదన్నారు. తనను చూస్తే వైఎస్ గుర్తొస్తారని.. అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకుటారన్న నమ్మకంతో ఉన్నానని షర్మిల తేల్చేశారు.
Also Read : సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్ చిక్కులు .. విచారణకు పిలిచిన సిర్పూర్కర్ కమిషన్ !