Sharmila : చేవెళ్ల టు చేవెళ్ల ... అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర
వైఎస్ షర్మిల పాదయాత్ర తేదీని ప్రకటించారు. అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రారంభమవుతుంది. మళ్లీ చేవెళ్లలోనే ముగుస్తుంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అని పేరు పెట్టారు. మీడియాకు తన పాదయాత్ర షెడ్యూల్ గురించి షర్మిల స్వయంగా వివరించారు. గతంలో వైఎస్ చేసిన పాదయాత్రకు కూడా ప్రజాప్రస్థానం అని పేరు పెట్టారు. ఇప్పుడు సెంటిమెంట్‌ను షర్మిల ఫాలో అవుతున్నారు. ఒక్క పేరు విషయంలోనే కాకుండా స్థలం విషయంలో కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. వైఎస్ పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా ప్రారంభిస్తారు. అలాగే ముగింపు కూడా చేవెళ్లలోనే ఉంటుంది. గ్రేటర్ పరిధి మినహా మిగిలిన అన్ని ఉమ్మడి జిల్లాలను షర్మిల పాదయాత్ర ద్వారా కవర్ చేస్తారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని షర్మిల తెలిపారు. Also Read : ‘కేటీఆర్ నువ్వు నన్ను ఏం చేయలేవు.. డ్రగ్స్ అంటే ఎందుకంత ఉలిక్కిపడతవ్’ రేవంత్ హాట్ కామెంట్స్
పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల కేసీఆర్ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. ఏడేళ్ల కేసీఆర్, ఆయన కుటుంబ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు కల్పిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు కేసీఆర్ అమ్ముడుపోయారని.. ఆయనపై ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తాము పోరాడతామని షర్మిల అన్నారు. పాదయాత్ర చేస్తున్నప్పటికీ ప్రతి మంగళవారం చేసే దీక్షలు మాత్రం ఆగవని.. స్పష్టం చేశారు. Also Read : కేసీఆర్ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలో ఐ ప్యాక్ టీం షర్మిల కోసం పని చేస్తుందని చెబుతున్నారు. పార్టీ నిర్మాణంపై షర్మిల ఇప్పటికే పలుసమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది పార్టీని వదిలి వెళ్లినప్పటికీ ఉన్న నేతలతోనే పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పని చేసుకోవాలన్న సూచనలు పంపుతున్నారు. Also Read : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?
షర్మిల పాదయాత్రతో తెలంగాణలో రోడ్డెక్కుతున్న నేతల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే తెలంగాణలో బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకు సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. హైకమాండ్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆయన కూడా నడక ప్రారంభించే అవకాశం ఉంది. పాదయాత్ర అధికారానికి దగ్గరి దారి అన్న అభిప్రాయం బలపడటంతో ఎక్కువ మంది పాదయాత్రకే మొగ్గు చూపుతున్నారు.
Also Read : కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి