Revanth Reddy: ‘కేటీఆర్ నువ్వు నన్ను ఏం చేయలేవు.. డ్రగ్స్ అంటే ఎందుకంత ఉలిక్కిపడతవ్’ రేవంత్ హాట్ కామెంట్స్
వైట్ ఛాలెంజ్ కోసం కేటీఆర్‌కు సవాలు విసిరిన ఆయన అందులో భాగంగా గన్ పార్కు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్‌లో మత్తు పదార్థాలు, గుడుంబా, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్‌మెంటే చెప్పిందని అన్నారు. డ్రగ్స్ కేసులో సంపూర్ణ విచారణ జరిపేందుకు 2017లో సిట్ కోసం అకున్ సబర్వాల్‌ను నియమించారని గుర్తు చేశారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆ ఐపీఎస్ అధికారి విచారణ మధ్యలో ఉండగానే బదిలీ అయ్యారని.. ఆ తర్వాత వచ్చిన అధికారులు కొంత మంది నిందితులను తప్పించారని చాలా వార్తలు వచ్చాయని అన్నారు. వైట్ ఛాలెంజ్ కోసం కేటీఆర్‌కు సవాలు విసిరిన ఆయన అందులో భాగంగా గన్ పార్కు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులతో మాట్లాడారు.
వైట్ ఛాలెంజ్ అందుకే..
తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి పారదర్శకమైన, ఆదర్శవంతమైన ప్రజా ప్రతినిధులుగా ఉందామనే ఉద్దేశంతో తాను వైట్ ఛాలెంజ్ విసిరానని అన్నారు. ‘‘యువత రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి, మనమేంటో నిరూపించుకోవాలి. అందుకే వైట్ ఛాలెంజ్ విసిరాను. డ్రగ్స్ వ్యవహారంలో మనం పరీక్ష చేయించుకొని ఏం తప్పు చేయలేదని చాటాలి. పవిత్ర స్థలం అయిన గన్ పార్కు వద్దకు రావాలని మంత్రి కేటీఆర్‌కు, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాలు విసిరా.. ఇక్కడి నుంచి డైరెక్ట్ ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుందాం. అలాగే మీరు కూడా ఈ సవాలు చెరో ఇద్దరికి సవాలు విసురుకుంటూ పోవాలని కోరా. నా సవాలు మేరకు కేటీఆర్ ఓ అరగంట ముందే ఇక్కడికొచ్చి ఉంటడనుకున్నా. కానీ, పొద్దున నుంచి తిట్ల దండకం ఎత్తుకున్నడు. నాకర్థం అయితలే.. కేటీఆర్ ఎందుకు అంత భయపడుతున్నడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ రావాలంటడు. ఢిల్లీ వాళ్లు సిద్ధమైతే ఇవాంకా ట్రంప్ కూడా కావాలంటరు.. నేనేడికెల్లి తేచ్చేది.’’ అని గన్ పార్కు వద్ద మాట్లాడారు.
‘‘డ్రగ్స్ విచారణకు ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను కార్యాలయాలకు పిలిచారు. ఇటీవల వాళ్లెవర్నో విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నడు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ్ని నేను. నన్ను ఆయన స్థాయికి తగడు అంటే ఎలా? నేను 2006లో జడ్పీటీసీని, 2007లో నేను ఎమ్మెల్సీని, 2009లో ఎమ్మెల్యేని, 2014లో ఎమ్మెల్యే, మళ్లీ ఇప్పుడు ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడ్ని. నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి నువ్వు రాజకీయాల్లోకే రాలేదు. రాజకీయ పరంగా నువ్వు నా వెంట్రుకతో సమానం కేటీఆర్. ఎలాగో మంత్రివయ్యావు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి. నా ఛాలెంజ్‌ను స్వీకరించు. తెలంగాణ ప్రజా ప్రతనిధులు పారదర్శకంగా ఉన్నారని నిరూపించు’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘కేటీఆర్.. నువ్వు వెళ్లే, తిరిగే ప్రాంతాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నరని నేను ఇంతకుముందే చెప్పా. కేసీఆర్, కేటీఆర్ అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్ ఏరియాల్లో ఏకంగా 60 పబ్బులకు అనుమతించారు. అంతకుముందు నాలుగైదే ఉండేవి. నేను రాజకీయ ఆరోపణలు చేయట్లేదు. శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ప్రముఖ పబ్బుల్లో మీరు రహస్యంగా తిరగండి. మీరు అనుమతించిన పబ్బుల్లోనే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుస్తుంది. తాగి, ఊగి రోడ్లపై పొర్లుతుంటారు. మీకు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కనిపించడం లేదా? టీఆర్ఎస్ పార్టీ నేతల బంధువులే ఈ పబ్బులు నడుపుతున్నారు. దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సవాలు విసిరిన కొండా
రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు మంత్రి కేటీఆర్ ముందుకు వస్తే ఆయన స్థాయి మరింత పెరిగి ఉండేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైట్ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సవాలు విసిరారు.