Praja Palana Applications: ప్రజా పాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ వేగవంతం, డెడ్‌లైన్ ఎప్పుడంటే!
Praja Palana Abhaya Hastam applications:
Congress 6 Guarantees: వరంగల్: ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతమైంది. రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో అధికారులు ప్రజా పాలన దరఖాస్తులను డిజిటల్ డేటా చేసే ప్రక్రియ చకచక కొనసాగుతున్నది. ఆరు గ్యారంటీల దరఖాస్తులతో పాటు సాధారణ, రేషన్ కార్డుల కోసం స్వీకరించిన 2 లక్షల 86 వేళా 820 దరఖాస్తుల (Praja Palana Applications) కంప్యూటరీకరణ జరుగుతోంది. డిజిటల్ డేటాగా మార్చితే దరఖాస్తుల పరిశీలన, వెరిఫికేషన్, లబ్ది చేకూర్చడం సులభతరం అవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.
4 వందల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పని..
వరంగల్ బల్దియా పరిధిలోని జీ డబ్ల్యు ఎం సీ ప్రధాన కార్యాలయం, చైతన్య డిగ్రీ కళాశాల, వాగ్దేవి కళాశాల, తాళ్ళ పద్మావతి కళాశాల కేంద్రాల్లో సుమారు 4 వందల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ లు నమోదు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీలోగా కంప్యూటరీకరణ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేశారు. దరఖాస్తుల నమోదు పరిశీలనకు వార్డు స్థాయి లో వార్డు ఆఫీసర్లు, రెండు వార్డు లకు ఒక సూపర్ వైజర్, ప్రతి మూడు వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించారు కార్పొరేషన్ అధికారులు. బల్దియా పరిధి లోని హన్మకొండ సర్కిల్ కు నోడల్ అధికారి గా అదనపు కమీషనర్ రవీందర్ యాదవ్, వరంగల్ సర్కిల్ కు నోడల్ అధికారి గా అదనపు కమీషనర్ అనిసుర్ రషీద్ లు వ్యవహరిస్తు నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. వారంలోగా దరఖాస్తుల సమగ్ర డేటా నమోదు అయ్యేలా పటిష్ఠమైన చర్యలు చేపట్టారు.
ప్రజాపాలనలో మొత్తం1,25,84,383 దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలనా కార్యక్రమం జరిగిన పదిరోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర పనులకు సంబంధించి అప్లికేషన్లు 19 ,92 ,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16 , 392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1 ,11 ,46 ,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3 ,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ ఎంసీ లోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17 వ తేదీ లోగా డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.