New House Trend : అతి తక్కువ ఖర్చులో సొంతిళ్లు, వరంగల్ లో న్యూ ట్రెండ్!
అతి తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు. వరంగల్ మొదలైన రెడీమేడ్ ఇళ్లకు మంచి క్రేజ్ వస్తుంది.
తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో అందమైన ఇల్లు నిర్మాణం అవుతుంది. లక్షల రూపాయలు పోసి నిర్మాణం పనుల కోసం పడిగాపులు పడే పని లేకుండా నిమిషాల్లో ఇంటి నిర్మాణం జరిగి దర్జాగా గృహప్రవేశం చేసుకుని జీవనం సాగించే పద్దతి ఇప్పుడు సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి. రెడీమేడ్ ఇండ్లతో సొంతింటి కల సాకారం అవుతుంది. రెడీమేడ్ ఇండ్ల కథ ఏంటి ? నిర్మాణం ఎలా చేస్తారు? ఎంత ఖర్చు అవుతుంది. ఆ ఇండ్లు ఎలా ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలంటే వరంగల్ కి వెళ్లాల్సిందే.
స్వంత ఇంటి కల కోసం
పెరుగుతున్న నగరీకరణ, పెరుగుతున్న నగర జనాభాను అనుసరించి ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అపార్ట్‌మెంట్లలో ఉండేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సొంత ఇళ్ల కోసం ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. సాంకేతిక విజ్ఞానం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో చౌకధరకు ఇళ్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో నగరాలు, పెద్ద రిసార్టుల్లో ఉండే రెడీమేడ్ గృహాలు ఇప్పుడు తొలిసారిగా ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా దర్శనమిస్తున్నాయి. వరంగల్ నగరంలో ప్రస్తుతం రెడీమేడ్ ఇళ్లు దర్శనమిస్తున్నాయి.
హనుమకొండలోని వడ్డేపల్లి సాయినివాస్ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్ పక్కన సిమెంట్ పిల్లర్లపై రెడీమేడ్‌గా నిర్మించిన ఇంటిని అమర్చారు. ఇలా రెడీమేడ్‌గా నిర్మించిన ఇంటికి రూ. 8 లక్షలకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. రెడీమేడ్‌గా హైదరాబాద్‌లో నిర్మించిన ఇంటి గోడలను ఇతర సామాగ్రిని రెండు కంటైనర్లలో తీసుకొచ్చి వరంగల్‌లో అమర్చినట్లు తెలుస్తోంది. ఇలా రెడీమేడ్ ఇళ్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో నిర్మితమౌతున్న ఇళ్లకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. కానీ అందుకు తగిన విధంగా వారి వద్ద ఆర్థిక వనరులు లేక రక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సొంత ఇల్లు కట్టుకోవాలంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. విపరీతంగా పెరిగిన సిమెంట్, ఐరన్, ఇసుక ధరలతో సామాన్యులు ఇంటిని కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక అటువంటి వారికి ఎక్కడికైనా తీసుకెళ్లగల , రెడీమేడ్ ఇల్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అతి తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇక ఇటువంటి రెడీమేడ్ ఇళ్లను పకడ్బందీగా తయారు చేస్తున్న ఎన్నో సంస్థలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.
వరంగల్ నగరంలో రెడీమేడ్ ఇల్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కడైనా పెట్టుకో గలిగిన ఫిక్స్డ్ ఇళ్లు వచ్చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అటువంటి ఇంటిని హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వడ్డేపల్లి కి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ఫ్లాట్ లో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారు. అయితే ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకొని, రెడీమేడ్ హౌస్ కొనుగోలు చేసి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.