Etela Rajender On KCR : పేరు మార్పుతోనే కేసీఆర్ పతనం స్టార్ట్, ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
Etela Rajender On KCR : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.
Etela Rajender On KCR : తెలంగాణలో దళితులను వంచన చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ కు ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ బీజేపీ కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 12 మంది దళిత బిడ్డలకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారని ఈటల అన్నారు. రాష్ట్రంలో దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. టీఆరెస్ పార్టీని బీఆరెస్ గా మారడంతోనే కేసీఆర్ పతనం మొదలయ్యిందన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది చాలక దేశంలో దోచుకోడానికి బీఆర్ఎస్ పార్టీగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ ఛాంబర్లో ఒక్క దళిత అధికారి లేరని, ఇది రాష్ట్ర దళిత సోదరులు గమనించాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పక్కకు పెట్టి చెరుకు రైతులను కడుపు కొట్టిన ఘనత కేసీఆర్ ది అని మండిపడ్డారు.
"ఆర్టీసీ వ్యవస్థలో మూడు వంతులు ప్రైవేటీకరణ చేసి సామాన్య ప్రజలను, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అన్యాయం చేశారు. తెలంగాణ ప్రజలను లిక్కర్ కు బానిస చేసి కార్మిక కర్షకులను దోచుకుంటున్న మహానుభావుడు కేసీఆర్. విద్యను వ్యాపారం చేసి అనుచరులకు, బినామీలకు కట్టబెట్టి సామాన్య ప్రజానీకానికి విద్యను దూరం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది. బీజేపీలో సామాన్యులు సైతం రాజ్యాధికారం చేస్తున్నారు ఆ ఘనత నరేంద్రమోదీకి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి" - ఈటల రాజేందర్
ఈసారి గల్లీలో కూడా ఉండనివ్వరు - డీకే అరుణ
కేసీఆర్ దిల్లీకు పోవడం కాదు, తెలంగాణ ప్రజలు గల్లీలో కూడా ఉండకుండా చేస్తారని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ఇవ్వడం చేతకాని తెలంగాణ ముఖ్యమంత్రి, దేశాన్ని పాలిస్తానంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ చేతిలో అధికారం, పిచ్చోని చేతిలో రాయిలా మారిందన్నారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, దేశాన్ని ఉద్దరిస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పేరుతో వెలగ పెట్టింది లేదని, ఇప్పుడు బీఆర్ఎస్ తో వెలగ పెట్టేదిలేదన్నారు. ఏమి మాట్లాడాలో అర్థం కాక సమయం అయిపోయిందా? హెలికాప్టర్ తో పెద్ద సమస్య అని, ప్రసంగం మధ్యలో అనడం, ముఖ్యమంత్రి కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికే తప్ప మరొకటి కాదన్నారు. ఉచిత విద్యుత్ తెలంగాణకే దిక్కు లేదని, దేశమంతా ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే , కేంద్రం నుంచి వచ్చి హిందీలో మాట్లాడుతారని విమర్శించిన కేసీఆర్, ఇప్పుడొచ్చిన నాయకులంతా ఏ భాషలో మాట్లాడారో ముఖ్యమంత్రి చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ - ఎంపీ అర్వింద్
"నిన్నటి బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్. ఖమ్మం సభలో లిక్కర్ స్కామ్ తో పాటు ఇతర స్కామ్ ల్లో ఉన్నవారంతా స్టేజి మీద ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ సంగతి దేవుడెరుగు. ఏసీడీ ఛార్జీల మీద రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి ముందు. నియోజక వర్గానికి 100 మందికి దళిత బంధు ఇచ్చామని సీఎం అంటున్నారు. అంటే రాష్ట్రంలో కేవలం 10000 మందికి మాత్రమే ఇచ్చినట్లా? రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 16 లక్షల మంది దళితులున్నారని కేసీఆర్ గతంలో చెప్పారు. మరి అందరికి ఎందుకు ఇవ్వలేదు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని గాలికి వదిలేశారు. బీఆర్ఎస్ పేరుతో పిచ్చిపట్టి తిరుగుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది." - బీజేపీ ఎంపీ అర్వింద్