CM KCR in Wanaparthy: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మన ఊరు-మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
CM KCR in Wanaparthy: వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారభించారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు.
CM KCR in Wanaparthy: తెలంగాణ వనవర్తిలో మన ఊరు-మన బడి(Mana Ooru-Mana Badi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(CM KCR) మంగళవారం శ్రీకారం చుట్టారు. మన ఊరు–మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని సీఎం అన్నారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని వనపర్తి(Wanaparthy) నుంచి ప్రారంభించడం ఈ జిల్లాకు దక్కిన గౌరవం అన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకి ఇంతటి స్థాయికి వచ్చామన్నారు. తమ గురువులు చెప్పిన విద్య వల్ల ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్(Wanaparthy Collectorate) సమీకృత భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
జీఎస్డీపీలో తెలంగాణ టాప్
వనపర్తి కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ లు కూడా ఈ స్థాయిలో లేవని, అంత అద్భుతంగా కలెక్టరేట్లను నిర్మించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.."ఎనిమిదేళ్ల క్రితం పాలమూరు కరవు జిల్లా, ఇప్పుడు కరవు మాయమయ్యి పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎకానమిక్ సర్వే నిన్న విడుదల చేసుకున్నాం. తెలంగాణ దేశంలో అనేక విషయాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంది. తలసరి వ్యక్తి గత ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్, జీఎస్డీపీ(GSDP)లో ముందు వరుసలో ఉంది. ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని మీరు అనుకున్నారు కాబట్టి ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు తెలంగాణలో కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు కోతలు లేని కరెంట్ అందిస్తున్నాం. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఇంకా ఏ శాఖల్లో ప్రమోషన్లు ఇవ్వాలో ఇవ్వమని సీఎస్ కు సూచించాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు చాలా మంది అనేక ఆరోపణలు చేశారు. మీకు పాలన చేతకాదు అన్నారు. కానీ వాటన్నింటిన్నీ రాంగ్ అని నిరూపించాం. ఎప్పటి నుంచో ఉన్న రాష్ట్రాల కన్నా తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువ." అని సీఎం కేసీఆర్ అన్నారు.
కోతల్లేని విద్యుత్ అందిస్తున్నాం
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా కోతల్లేకుండా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించామన్నారు. ఇప్పుడు విద్య, వైద్యంపై దృష్టిసారించామన్నారు. ఇవాళ రూ.పది వేల కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని వనపర్తిలో ప్రారంభించుకున్నామన్నారు. వనపర్తిలో ఇప్పటికే మెడికల్ కాలేజీ కూడా వచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తామన్నారు.