Telangana News : ఒకరిపై ఒకరు కాదు బీఆర్ఎస్‌పై పోరాడండి - ఈటల, రేవంత్‌లకు విజయశాంతి సలహా !
బీఆర్ఎస్‌పై పోరాడాలని ఈటల, రేవంత్ రెడ్డిలకు విజయశాంతి సలహా ఇచ్చారు. వాళ్లిద్దరిని తమ్ముళ్లుగా పేర్కొంటూ సోషల్ మీడియలో పోస్ట్ పెట్టారు.
Telangana News : ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకరిపై ఒకరు పోరాడటం కాకుండా ఎవరి దారిలో వారు బీఆర్ఎస్‌పై పోరాడాలని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సలహా ఇచ్చారు. వారిద్దరూ ఒకరికొకరు సవాళ్లు చేసుకుంటున్న విషయంపై ఆమె సోషల్ మీడియాలో స్పందంచారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నదని.. ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదనేది నిజమని వారిద్దరికీ విజయశాంతి గుర్తు చేశారు. ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆరెస్‌కు ఉపయోగపడుతున్నాయన్నారు. ఈటల, రేవంత్ రెడ్డిలను తమ్ముళ్లుగా పేర్కొన్న విజయంశాంతి.. తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో... ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని సలహాఇచ్చారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ...నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందని గుర్తు చేసుకున్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డబ్బులిచ్చారని ఈటల ఆరోపణ
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈరోజు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఈరోజు సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ చేశారు.
అమిత్ షా సభ ఏర్పాట్లలో బిజీగా ఉండి స్పందించని ఈటల
అయితే ఇంత చర్చకు కారణమైన ఈటల రాజేందర్ మాత్రం ఇంకా స్పందించలేదు. అందుకు కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో బిజీగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బిజీబిజీగా ఉన్నారు. అమిత్ పర్యటన నేపథ్యంలో రేవంత్ సవాల్‌పై స్పందించేది లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారు. అమిత్ షా పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా చేవెళ్ల సభ పూర్తయిన తర్వాత ఈటల రాజేందర్ స్పందించే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వత్తాసు ఎందుకని డీకే అరుణ ప్రశ్న
అయితే ఈ అంశంపై మరో బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే రేవంత్ కు అంత ఉలిక్కిపాటు ఎందకని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం అంతకంతకూ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.