Power Charges: ప్రజలకు కేంద్రం ఝలక్! ఈ టైంలో కరెంటు వాడితే ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు!
‘టైం ఆఫ్ డే’ (టీఓడీ) పేరు పెడుతూ కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. గరిష్ఠంగా కరెంటు డిమాండ్ ఉన్న సమయంలో కరెంట్ వాడితే 20 వరకూ అధిక ఛార్జీ వసూలు చేయనున్నారు.
విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఝలక్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తోంది. కరెంటు వాడకంలో భాగంగా అత్యంత డిమాండ్ ఉండే సమయంలో (పీక్ అవర్స్) వాడే కరెంటుకు ఏకంగా 20 శాతం వరకూ అధిక ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘టైం ఆఫ్ డే’ (టీఓడీ) పేరు పెడుతూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గరిష్ఠంగా కరెంటు డిమాండ్ ఉన్న సమయం (టీఓడీ)లో కరెంట్ వాడే పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, కమర్షియల్ వినియోగదారులకు 2024 ఏప్రిల్ 1లోగా 20 శాతం, ఇళ్లలో వినియోగదారులకు 2025 ఏప్రిల్ 1లోగా 10 శాతం ఛార్జీలను పెంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్ ఆఫ్ కన్స్యూమర్) సవరణ రూల్స్-2023 డ్రాఫ్ట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14వ తేదీలోపు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్రాల అభిప్రాయాలు తెలిపిన అనంతరం ఈ నిబంధన అమల్లోకి తీసుకొస్తారు.
మరోవైపు, రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ ఎండ బాగా ఉన్న సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి, ఆ సమయంలో వాడే విద్యుత్ ఛార్జీలను 20 శాతం తగ్గించాలని సూచించింది. ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు 2025 ఏప్రిల్ 1వ తేదీలోపు వ్యవసాయ వినియోగదారులు కాకుండా, మిగతా వినియోగదారులకు స్మార్ట్/ప్రీ పెయిడ్ మీటర్లు బిగించాలని కేంద్రం స్పష్టం చేసింది.
పీక్ అవర్స్ అంటే..
సాధారణంగా విపరీతంగా కరెంటు వాడే సమయాన్ని పీక్ అవర్స్ అంటారు. పీక్ డిమాండ్ అనేది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. పీక్ అవర్స్‌లో కరెంటును డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ లో అధిక ధరను వెచ్చించి పంపిణీ సంస్థలు కరెంటును కొంటున్నాయి. దానివల్ల ఆర్థికంగా భారం పడుతోంది. యూనిట్ కరెంటుకు రూ.5 వసూలు చేస్తుంటే, దానిపై 20 శాతం అదనంగా యూనిట్‌కు రూ.6 వసూలు చేయాలని గుర్తు చేసింది. డిమాండ్ లేని సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా యూనిట్ విద్యుత్తు రూ.5గా ఉంటే 20 శాతం తక్కువగా రూ.4 వసూలు చేయాలని సూచించింది.
తెలంగాణలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు అత్యధికంగా 13,970 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. రాత్రి 10 గంటలకు డిమాండ్ 8 వేల మెగావాట్లకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రోజూ ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకూ గరిష్ఠ డిమాండ్ ఉంటోంది. ఈ సమయాల్లో కోతలు లేకుండా సరఫరా చేయడానికి పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇంధన ఎక్స్ఛేంజిలో యూనిట్‌కు రూ.12 చెల్లించి కరెంట్ కొంటున్నాయి. దీంతో వాటిపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. గరిష్ఠ డిమాండ్ కొంత సమయం పాటు మాత్రమే ఉండడం, తర్వాత వెంటనే అందులో సగానికి పడిపోతున్నందున కరెంట్ సరఫరా గ్రిడ్ నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి టీఓడీ విధానాన్ని తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది.