Telangana Congress: రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేసుకో - ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సలహా
Congress MLAs: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత ఉండటం లేదు. ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేల మధ్య రచ్చ ప్రారంభమయింది.

Nalgonda Congress MLAs: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య కొత్త పంచాయతీ ప్రారంభమయింది. మదర్ డెయిర్ ఎన్నికలు ఈ పంచాయతీకి కారణం అయ్యాయి. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెట్టి వారికి కాకుండా.. బీఆర్ఎస్‌కు చెందిన తన బంధువులకు మద్దతు ఇస్తున్నాడని తుంగతుర్తి ఎమ్మెల్యే మందు సామేలు ఆరోపించారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు అని ప్రెస్‌మీట్ పెట్టి మండిపడ్డారు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ తో పొత్తు పెట్టుకుంటున్నారని దానికి బీర్ల ఐలయ్యే కారణమన్నారు.
రాజకీయ వ్యభిచారం మానుకోవాలని ఐలయ్యకు మందుల సామేలు హితవు పలికారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ని బొందపెట్టకు..అని సలహాలిచ్చారు. మదర్ డైరీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడని.. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మందుల సామేలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు, కార్యకర్తలు మీకు సరైన బుద్ది చెబుతారని.. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.
మదర్ డైరీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వివాదాలు తీవ్రం అయ్యాయి. గత సంవత్సరం మదర్ డైరీ ఎన్నికల్లో డైరీ పైన అవగాహన లేని, పరిపాలనా అనుభవం లేని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్నేహితుడైన గుడిపాటి మధుసూదన్ రెడ్డిని చైర్మన్ చేయడం వల్ల సంవత్సర కాలంలోనే డైరీకి రూ.11 కోట్లు నష్టం వచ్చిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికీ బీర్ల ఐలయ్య తన అనుచరులకే అవకాశాలు కల్పిస్తున్నారని పార్టీకి మోతే పిచ్చిరెడ్డి అనే నేత రాజీనామా చేశారు. ఆయన భార్య ఇప్పటి వరకూ మదర్ డైరీ డైరక్టర్ గా ఉన్నారు.
మదర్ డైరీ డైరెక్టర్‌గా తన భార్యకు అవకాశం కల్పించాలని ఎన్నికల ముందు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కోరగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని పిచ్చిరెడ్డి అంటున్నారు. 24 గంటలలోపు విరమించుకోకుంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని షోకాజ్ నోటీసు అందజేసినట్లు తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా షోకాజ్ నోటీసులు అందజేసి అగౌరవ పరిచిన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటి నుండి తనకు ఎలాంటి సంబంధం లేదని పిచ్చిరెడ్డి ప్రకటించారు. ఇలా మరికొంత మంది నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు స్థానిక డైరీ పదవుల విషయంలో సరిగ్గా డీల్ చేయకోపవడం, ఎవరి ఆధిపత్యం వారు చూసుకుంటూ ఉండటంతో.. పార్టీకి సమస్యలుగా మారుతున్నాయి.





















