Free Bus Service: ఫ్రీ బస్ సర్వీస్ - మహిళలకు బిగ్ అలర్ట్
Telangana News: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, గుర్తింపు కార్డులకు సంబంధించి టీఎస్ఆర్టీసీ తాజాగా కీలక ప్రకటన చేసింది.
Tsrtc Announced Valid Id Proofs For Free Bus Service: రాష్ట్రంలో 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన మహిళలు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి 'జీరో టికెట్' (Zero Ticket) పొందవచ్చు. సిటీ ఆర్డీనరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే, జిరాక్సులు, ఫోన్లలో చూపించే గుర్తింపు కార్డులు చెల్లవని, కచ్చితంగా ఒరిజనల్ గుర్తింపు కార్డులు చూపించాల్సిందేనని టీఎస్ఆర్టీసీ (Tsrtc) ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా, గుర్తింపు కార్డులకు సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉపయోగించుకునే వారు ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను విధిగా చూపించాలి. ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ గుర్తింపు కార్డులో స్పష్టంగా కనిపించాలి. స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలకు, కలర్ జిరాక్సులకు చూపిస్తే అనుమతి ఉండదు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లుబాటు కాదు.' అని పేర్కొన్నారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ… pic.twitter.com/7WGyTPfqDE
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 8, 2024
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సుల (Sankranti Special Buses)ను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిలో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. ఈ నెల 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్ లుగా నియమించినట్లు చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు. ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు. పండుగ సమయంలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Also Read: Prajapalana: 'ప్రజాపాలన' దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్ - మీకు ఆ ఫోన్ కాల్స్ వస్తున్నాయా.?