(Source: ECI/ABP News/ABP Majha)
Ganesh Immersion: గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టుకు తెలంగాణ సర్కార్
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
వినాయక నిమజ్జనం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్, గ్రేటర్‌లోని ఇతర జలశయాల్లోనూ నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని పలు కాలనీల్లోని మండపాల్లో సుమారు లక్షకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. ఇందులో 90 శాతం పీఓపీ విగ్రహాలే పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగైతే నిమజ్జనానికి 6 రోజుల సమయం
ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలను అనుమతించక పోతే.. మొత్తం విగ్రహాలు పూర్తి కావడానికి 6 రోజుల సమయం పడుతుందని జీహెచ్‌ఎంసీ హైకోర్టుకు తెలిపింది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కూడా కొంత సమయం అవసరమని వివరించింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని విన్నవించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. ఇందు కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించింది.
నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది. అయితే కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లోనే విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?