AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Gun Fire in Annamayya District | రాయచోటి: తెలుగు రాష్ట్రాల్లోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిత్యం ఏదో చోట తుపాకీతో బెదిరింపులనో, గన్‌తో కాల్పులు జరిపి నిందితులు పరారీ అనే విషయాలు వింటూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
రాయచోటి మండలం మాధవరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యాపారులపై కాల్పులు జరిపారు. స్క్రాప్ వ్యాపారం చేసే ఇద్దరిపై నిందితులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. నిందితుల కాల్పుల్లో పాత సామాన్లు కొనే వ్యాపారులు హనుమంతు(50)తో పాటు రమణ(30) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారులను చికిత్స అందించేందుకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. డబ్బుల కోసం నిందితులు కాల్పులు జరిపారా, లేక వీరి మధ్య పాత కక్షలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.