Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
స్కూలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సత్వరమే షెడ్డు మరమ్మతులు చేపట్టాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు.
కడప: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా కడప జిల్లాలో ఓ స్కూలు విద్యార్థులు పడుతున్న బాధపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కడప జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ పాఠశాలలో వర్షం కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసింది. దాంతో సత్వరమే షెడ్డు మరమ్మతులు చేపట్టాల్సిందిగా స్థానిక అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా పునాదుల్లో నిలిచిపోయిన స్కూలు భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం అన్నారు. కొర్రపాడు స్కూలు చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నిర్మాణ దశలోనే ఆగిన స్కూల్ బిల్డింగ్
మామూలు ఇటుక గోడలు మాత్రమే ఉన్నాయి, గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయే ఇనుప రేకుల పైకప్పు మాత్రమే ఉంది. వర్షాకాలంలో పాములు, జెర్రులు, తేళ్లు, ఎలుకలు వస్తుంటాయని వైఎస్సార్ కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలోని కొర్రపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థులు తమ బాధను చెప్పుకున్నారు. స్కూల్ నిర్మాణ దశలోనే ఆగిపోయిందని, అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, టీచర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించారు. త్వరలోనే వారి సమస్యకు శాశ్వాత పరిష్కారం చూపిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కడప జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య నా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం తాత్కాలికంగా రేకుల షెడ్డులో నడుస్తున్న ఆ పాఠశాలలో వర్షం కారణంగా విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. సత్వరమే షెడ్డు మరమ్మతులు చేపట్టాల్సిందిగా… pic.twitter.com/3dYG7CsrrL
— Lokesh Nara (@naralokesh) December 21, 2024
జెస్సీరాజ్‌కు మంత్రి లోకేష్ అభినందనలు
స్కేటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రధానమంత్రి బాలపురస్కార్ 2025 అవార్డును అందుకున్న జెస్సీరాజ్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలుపుతున్నాను. అంకితభావం, పట్టుదలతో ఈ ప్రతిష్టాత్మకు అవార్డును జెస్సీరాజ్ కైవసం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె చేస్తున్న కృషికి నిరంతరం మద్దతుగా నిలుస్తామని... జెస్సీరాజ్ మరిన్ని విజయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం తరఫున అన్నివిధాల సహాయ, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.