KCR TRS Party: 21 ఏళ్ల టీఆర్‌ఎస్ ఇక తెరమరుగు, నేషనల్ హైవే ఎక్కిన కారు - గల్లీ టూ ఢిల్లీకి ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు.
జాతీయ రాజకీయాలపై ఎంతో కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనబర్చుతున్న ఆసక్తి, అందుకు తగ్గట్లుగా విస్తృత ప్రచారాల మధ్య ఎట్టకేలకు జాతీయ పార్టీ పేరును నేడు (అక్టోబరు 5) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో జాతీయ పార్టీ అజెండా, లక్ష్యాలను కేసీఆర్ వివరించారు. అందుకు అనుగుణంగా పార్టీ పేరును మార్చుతున్నట్లుగా సంతకాల సేకరణ చేపట్టారు. సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిన వెంటనే మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కొత్త పేరును ప్రకటించారు.
హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో 21 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న కేవలం వందల మంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, కొందరు మేధావులు తప్ప మెయిన్‌స్ట్రీం రాజకీయ నాయకులు ఎవరూ లేరు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. ఆ వేదిక మీద ఉద్యమనేత కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వ పదవులను త్యాగం చేస్తూ ప్రకటించారు. పార్టీ భవిష్యత్తు కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. పార్టీ ప్రకటించిన 20 రోజుల వ్యవధిలోనే కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహించారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్పు
మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ.. బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన ముద్ర వేస్తూ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా ఆయన గతంలోనే ప్రకటించారు.
ఎన్నికల సంఘం అనుమతి పొందాకే అధికారిక మార్పు
ప్రస్తుతానికి ఇవాళ కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ తీర్మానం మాత్రమే చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును రద్దు చేయించి.. భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు.
ఈసీ దానిని పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలుపాల్సిందిగా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు లేదా.. ఆ పార్టీ ఇచ్చిన లేఖను స్వీకరించి ఆమోదించవచ్చు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని భావిస్తే పత్రికా ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. 30 రోజుల వ్యవధిలో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే తుది నిర్ణయం వెలువరిస్తుంది. అధికారికంగా కొత్త పేరు మనుగడలోకి వస్తుంది. టీఆర్‌ఎస్ దరఖాస్తుకు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభిస్తే టీఆర్‌ఎస్ కొత్త పేరు, గుర్తుతో ఎన్నికల్లో నిలుస్తుంది. అప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమితిగానే రికార్డుల్లో ఉంటుంది.