TRS: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు.. బడ్జెట్ సానుకూలంగా లేకపోతే పోరాటమే..: ఎంపీలు
సీఎం దిశా నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నేడు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా వారు ఇలా చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందస్తు వ్యూహం ప్రకారమే వారు తొలి రోజు నుంచే నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. అందులో సీఎం నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నేడు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా వారు ఇలా చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం వద్ద ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి. కేంద్రం విధానాలకు నిరసనగా కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది.
తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయట కూడా పోరాడాలనే యోచనలో పార్టీ ఎంపీలు ఉన్నారు. విభజన హామీలు, ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. శీతకాల సమావేశాలను కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు బహిష్కరించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం (జనవరి 31) ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వాగత ఉపన్యాసం చేశారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ప్రతి భారతీయుడికీ స్వాతంత్ర్య అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మూల సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతగా నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ముందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను తీసుకువస్తారు. రేపు ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆమె కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టనున్నారు.