TRS Ministers In Delhi : ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇస్తేనే వెనక్కి... అప్పటి వరకూ ఢిల్లీలోనే ఉంటామన్న తెలంగాణ నేతలు !
ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖిత పూర్వక హామీ వచ్చే వరకూ ఢిల్లీలోనే ఉండాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని గోయల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని టీఆర్ఎస్ సిద్ధమైంది. శని, ఆదివారం రెండు విడతలుగా ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు అక్కడే ఉన్నారు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా వారికి.. మంగళవారమే పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ దొరికింది. పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు సుమారు 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగానే ఇవ్వాలని మంత్రులు పట్టుబట్టారు.
Also Read: విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !
ప్రస్తుత సీజన్‌లో కేంద్రం పెట్టిన టార్గెట్ ప్రకారం ధాన్యం సేకరణ పూర్తయిందని.. ఇంకా ఐదు లక్షల ఎకరాల్లో ధాన్యం పంట కోతకు సిద్ధంగా ఉందని.. వాటిని సేకరించాలా వద్దా స్పష్టత ఇవ్వాలని పీయూష్ గోయల్‌ను కోరారు. అలాగే... యాసంగి సీజన్‌లో ఎంత కొంటారో కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని పీయూష్ గోయల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్పష్టమైన, లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చే వరకూ ఢిల్లీలోనే ఉండాలని మంత్రులు, ఎంపీలు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుంచి స్పష్టత రాకుండా తము ఢిల్లీ నుంచి వెల్లే ప్రశ్నే లేదనిచెబుతున్నారు.
తెలంగాణ మంత్రులు, ఎంపీలతో భేటీ అయ్యే ముందే పీయూష్ గోయల్ వివాదంపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి వచ్చిన బీజేపీ నేతలతో సమావేశం అయితే.. టీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ.. తెలంగాణ ధాన్యం గోల తప్ప, మాకు మరో పని ఉండదా..? అని కేంద్రమంత్రి చిరాకుపడ్డారు. ఎందుకు ఢిల్లీలో ఉన్నారు అంటూ తెలంగాణ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు పని, పాటా లేదా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కలవాలా? అని గోయల్ విరుచుకు పడ్డారు.
Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్
ధాన్యం సేకరణ అంశం కేంద్రం, తెలంగాణ మధ్య చిక్కుముడిగా పడిపోయింది. కేంద్రం ఎప్పుడూ చెప్పేదే చెబుతోంది.. తెలంగాణ కూడా ఒకటే వాదన వినిపిస్తోంది. ఇద్దరి వాదనల్లోనూ ఎవరికి వారు ఇతరులను తప్పు పడుతున్నారు. కానీ అసలు సమస్యలోనే స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించడంతో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read: KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు