AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !
విద్యుత్ బకాయిల గొడవను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సలహా ఇచ్చింది. కేవలం వడ్డీ అంశంలోనే వివాదం వచ్చిందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల వివాదాన్ని పరిష్కరించే విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ఆ విషయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలే చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చిన ఆర్కే సింగ్... ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందన్నారు. తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాశారని కేంద్ర మంత్రిచెప్పారు.
విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందమని విభజన చట్టానికి సంబంధం లేదన్నారు. విభదన జరిగన మెదట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు జరిపిందని తెలిపారు. తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదని ... వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పేచీ వచ్చిందన్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం
ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలుగురాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై చర్చలు జరగడం లేదు. తమకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అంటోంది.. లేదు తమకే ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ అంశంపై రెండు ప్రభుత్వాల మధ్య పొసగడం లేదు.
గతంలో టీడీపీ ఉన్నప్పుడు.. తెలంగాణ విద్యుత్ సంస్థలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉపసంహరించుకున్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. చివరికి ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ఇవ్వాల్సిన నిధులు ఇస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీ ప్రభుత్వం ఆశతో ఉంది.
Also Read: నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి