Jaggareddy: రాహుల్ గాంధీపై అస్సాం సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, మూర్ఖత్వంగా మాట్లాడారని జగ్గారెడ్డి ఫైర్
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం వ్యాఖ్యలను సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై మూర్ఖత్వంగా మాట్లాడారన్నారు.
రాహుల్ గాంధీ కుటుంబంపై అస్సాం సీఎం వ్యాఖ్యాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తప్పుబట్టారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ రాహుల్ గాంధీ కుటుంబంపై మూర్ఖంగా మాట్లాడారన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగా మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేత, అస్సాం సీఎంకి లేదన్నారు. దేశం కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీది అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీతో కలిసి నెహ్రూ 16 సంవత్సరాలు జైల్లో ఉన్నారన్నారు. అలాగే ఇందిరా గాంధీ బాల్య వయసులోనే ఐదారేళ్లు స్వాతంత్ర ఉద్యమంలో జైల్లోలో ఉన్నారన్నారు. దేశం కోసం ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలిదానం చేశారన్నారు.
గాంధీ కుటుంబం గురించి ప్రపంచానికి తెలుసు
'చరిత్రలో బీజేపీ ఎక్కడ ఉంది. అస్సాం సీఎం ఎక్కడ ఉన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా స్వాతంత్ర్య ఉద్యమంలో పుట్టినవారు కాదు. వాజ్ పాయ్, అద్వానీ తప్పితే ఇప్పుడున్న బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఎవరు స్వాతంత్ర్య ఉద్యమంలో పుట్టినవారు కాదన్నారు. ఎలాంటి చరిత్ర లేని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడం దురదృష్టకరం. ప్రపంచ దేశాలకు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ అంటే ఎవరో తెలుసని, గాంధీ కుటుంబం అంటే తెలుసు. ఈ తరం వరకు రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబం గురించి ప్రపంచ దేశాలకు తెలుసు. చదువుండి, తెలివుండి ఒక మూర్ఖుడిలా అస్సాం ముఖ్యమంత్రి అనుమానంగా మాట్లాడం ఏంటి. అస్సాం ముఖ్యమంత్రి తండ్రి ఒక్కడేనా అని మేము అంటే ఎలా ఉంటుంది. రాహుల్ గాంధీ తండ్రి గురించి నువ్వు మాట్లాడిన్నపుడు మేము నీ తండ్రి గురించి అంటే ఎలా ఉంటుంది. అమిత్ షా కి తండ్రి ఒక్కడేనా అని కాంగ్రెస్ పార్టీ అంటే మీకు బాధగా ఉంటుందా లేదా? మోదీకి తండ్రి ఒక్కడేనా అని కాంగ్రెస్ పార్టీ అంటే మీకు బాధగా ఉంటుందా లేదా?' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
మూర్ఖత్వ మాటలు మానుకోవాలి
అస్సాం సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి మూర్ఖత్వ మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. దేశ కోసం ప్రాణత్యాగాలు చేసిన తెచ్చిన స్వతంత్ర దేశంలో మీరంతా సీఎంలు అయ్యారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడి బీజేపీ నాయకులు దిగజారోద్దన్నారు. లేదంటే దానికి తగ్గట్లు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.