Telangana PCC: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై టీపీసీసీ నజర్! నేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో భేటీ కానున్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నాయకులు.. సీఎల్పీ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఇన్నాళ్లకు మళ్లీ దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసు కోర్టులో విచారణ దశలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిచింది. ఈ మేరకు కాంగ్రెస్‌ను అప్పట్లో వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో టీపీసీసీ ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో భేటీ కానున్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు.
12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన కేసు హైకోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో సంచలనం రేపుతోంది.
ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు
ఇటీవల ఫామ్ హౌస్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే. ఒక్క బాలరాజు మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరు ముగ్గురికి కేసీఆర్ ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కేసీఆర్ కూడా బీజేపీ చేసిన తప్పే చేశారంటున్న రేవంత్!
కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సబితా ఇంద్రారెడ్డి. సీఎల్పీ విలీనం అయిందని స్పీకర్ గెజిట్ జారీ చేయడంతో ఇది సాధ్యమయింది. అయితే ఇదంతా క్విడ్ ప్రో కో అని.. పార్టీ ఫిరాయింపు దారులకు.. పదవులు ప్రలోభ పెట్టి ఇలా చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఫామ్ హౌస్ కేసు కూడా పూర్తిగా ఇదే కోణంలో విచారణ జరగనుంది. నలుగురు ఎమ్మెల్యేలకు పదవులు, ఆర్థిక ప్రయోజనాలు ఆశ పెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారని.. తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకునేందుకు కేసీఆర్ చేసింది కూడా అదే కదా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తీసుకున్నారని.. బీజేపీ అదే పని చేసిందని.. కానీ ఇప్పుడు బీజేపీ చేసింది తప్పని చెబుతున్నారు కానీ.. తాము చేసింది తప్పని అంగీకరించడం లేదన్నారు.
2019లో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేల్లో.. సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), వనమా వెంకటేశ్వరరావు (కొత్త గూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియా నాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్ రెడ్డి (వికారాబాద్), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), బీరం హర్షవర్థన్ రెడ్డి (కొల్లాపూర్), జాజుల సురేందర్ రెడ్డి (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు) టీఆర్ఎస్‌లో వేర్వేరుగా చేరారు.