(Source: ECI/ABP News/ABP Majha)
T PCC Meeting : ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశం - కలసికట్టుగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టాలని టీ పీసీసీ నిర్ణయం !
కలసికట్టుగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టాలని టీ పీసీసీ నేతలు నిర్ణయించుకున్నారు. రేవంత్ 50 నియోజకవర్గాల్లో ఇతర సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని సూచించారు.
T PCC Meeting : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కొత్త కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆయన గాంధీ భవన్‌లో టీ పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు తర్వాత కొనసాగింపుగా చేపట్టాల్సిన హాత్ సే హాత్ జోడో యాత్రపై దిశానిర్దేశం చేశారు. ఎప్పుడూ లేని విధంగా సమావేశం ప్రశాంతంగా జరిగిందని.. అంతా కలసి కట్టుగా యాత్రను విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. సమావేశం తర్వాత కీలక నేతలు మీడియాతో మాట్లాడారు.
తాను ఎవరికీ అనుకూలం.. వ్యతిరేకం కాదన్న మాణిక్ రావు థాక్రే !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదని అలాంటి ఆలోచన పక్కన పెట్టాలని మాణిక్ రావు థాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అధిష్టానం చెప్పింది చేయడమే తన పని అన్నారు. ఎముకలు కోరికే చలిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు.. యాత్ర లక్ష్యాలను ఇంటింటికీ తీసుకు వెళ్లాల్సిన భాధ్యత ప్రతీ కార్యకర్త పై ఉందని గుర్తు చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకు వెళ్ళాలని... నేతలంతా ఐక్యంగా హాథ్ సే హాథ్ జోదో యాత్ర చేయండని సూచించారు. రేవంత్ రెడ్డి 50నియోజక వర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారని.. మిగిలిన సీనియర్లు కూడా 20, 30 నియోజక వర్గాల్లో యాత్ర చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హాథ్ సే హాథ్ ను ప్రతి ఒక్కరూ సక్సస్ చేయాలన్నారు. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దని సూచించారు.
ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర : రేవంత్
ప్రతీ గుండెకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26 న రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. శ్రీనగర్ లో జాతీయ జెండా ఎగరేసి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ లో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగం పై బీఆరెస్ నేతల దాడిపై సమావేశంలో చర్చించామని.. దాడులకు పాల్పడిన వారిపై కాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని రేవంత్ మండిపడ్డారు. మహిళను అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారని.. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని అయినా అయినా ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదని విమర్శించారు. అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సభకు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని.. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఫిబ్రవరి 6 లోగా కొత్త డీసీసీ లు బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చు. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని ఠాక్రే సూచించారని.. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు.
కలసికట్టుగా పాదయాత్రను విజయవంతం చేయాలన్న భట్టి విక్రమార్క
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జరుగుతందని భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీని స్పూర్తి గా తీసుకొని తెలంగాణ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేయడానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రెండు నెలల పాటు నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రలో రాహుల్ గాంధి సందేశాన్నిప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలని.. కాంగ్రెస్ ఆలోచనలు, భావా జాలాన్ని ప్రచారం చేసి హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపనిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు రెండు నెలల పాటు కష్టించి పని చేయడానికి కార్యకర్తలు సమయాత్తం కావాలన్నారు.