TS Schools New Timing: తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ లో మార్పులు, విద్యాశాఖ ఉత్తర్వులు
TS Schools New Timings: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
TS Schools New Timings: బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం తెలంగాణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల స్కూళ్లకు సెలవు సైతం ఇచ్చారు. తాజాగా విద్యా సంస్థల పనివేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రైమరీ స్కూల్ వాళ్లకు (1 నుండి 5వ తరగతి వరకు) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల స్కూల్ టైమ్ నిర్ణయించారు. ఉన్నత ప్రాథమిక పాఠశాల అంటే 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల స్కూల్ టైమింగ్స్ ను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటలుగా నిర్ణయించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు అమలులోకి వస్తాయని రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్.జేడీఎస్ఈలకు విద్యాశాఖ ఈ ఉత్తర్వులు పంపించింది. స్కూల్ యాజమాన్యాలకు సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిన్నాపిల్లలని ఉదయం త్వరగా నిద్రలేవలేరని వారికి 9.30 గంటలకు తరగతులు మొదలు కావాలని కొందరు ప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆలోచించిన విద్యాశాఖ తాజాగా స్కూల్ పనివేళలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. గత వారం కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తాజాగా మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు, వరద నీటి పరిస్థితుల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డీఆర్ఎఫ్ సిబ్బంది జంట నగర వాసులను హెచ్చరించారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాయదుర్గం, కొండాపుర్, మాదాపుర్, గచ్చిబౌలి, అత్తాపూర్, రాజేంద్రనగర్, మెహిదిపట్నం, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ఏరియాల్లోనూ వర్షం పడుతోంది. ఒక్కసారిగా తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెక్రటేరియట్ ముందు రోడ్డు జలమయమై చెరువులా కనిపిస్తోంది. పలు ఏరియాలలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం, మాతృభాషలో విద్యాబోధన
మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు అనుమతించింది. ఒకవైపు ఏపీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో, ఇతర సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో మాతృభాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకు అనుగుణంగా కొత్త పాఠ్యపుస్తకాలను 22 భారతీయ భాషల్లో కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందించాలని ఎన్‌సీఈఆర్‌టీని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial