Telangana News : గజ్వేల్‌లో శివాజీ విగ్రహం వద్ద మూత్రం - ఆగ్రహించిన వ్యక్తులు ఏం చేశారంటే ?
గజ్వేల్‌లో ఓ వ్యక్తి శివాజీ విగ్రహం వద్ద మూత్రం పోశాడు. దీంతో కొంత మంది వ్యక్తులు ఆ వ్యక్తిని కొట్టి.. మూతం పోసిన ప్రాంతం వద్ద నాకించారు. ఈ ఘటన వివాదాస్పదం అవుతోంది.
Telangana News : తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మద్దతులో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద మూత్రం పోశాడు. దీన్ని కొంత మంది వ్యక్తులు ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని చితికబాదారు. అందే కాదు.. వారంతా కలిసి ఆ మూత్రం పోసిన ప్రదేశంలో ఆ వ్యక్తితో నాకించినట్లుగా తెలుస్తోంది. ఇలా దాడి చేసిన వారంతా ఛత్రపతి శివాజీకీ జై, జై భారత్ మాతాకీ, జై శ్రీరాం అనే నినాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినా దాడి చేసిన వారు వదల్లేదని అంటున్నారు.
దాడి ఘటనపై బాధితుని బంధువుల నిరసన
దాడి చేసిన తర్వాత నీళ్లతో ఆ ప్రాంతాన్ని కడిగించారని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి వచ్చిన పోలీసులు ఆ అల్లరి మూక బారి నుండి కాపాడి స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత వ్యక్తి ఉండే ప్రాంతానికి చెందిన కొంత మంది బంధువులు.. గజ్వేల్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టారో లేదో ఇంకా స్పష్టత లేదు.
తాగిన మత్తులోనే అలా చేశాడంటున్న బంధువులు
ఛత్రపతి శివాజీని కావాలని అవమానించే ఉద్దేశం అతనికేమీ లేదని.. అతని కేవలం మద్యం మత్తులో .. ఎక్కడ మూత్రం చేస్తున్నాడో తెలియని పరిస్థితిల్లోనే అలా చేశాడని అంటున్నారు. ఇందులో మత పరమైన అంశాలు కానీ.. రాజకీయ పరమైన అంశాలు కానీ లేవంటున్నారు. ఈ అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది సున్నితమైన విషయం కావడంతో పోలీసులు కూడా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
గజ్వేల్ సీఎం నియోజకవర్గం కావడంతో మరింత గోప్యత
గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా అక్కడ్నుంచి రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ అన్ని పార్టీల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని.. కేసీఆర్ ను ఓడిస్తానని ఈటల రాజేందర్ గతంలో పలుమార్లు ప్రకటించారు. అయితే హైకమాండ్ ఆదేశిస్తే అన్నారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేయడం లేదు కానీ.. హై ప్రోఫైల్ నియోజకవర్గం కావడంతో.. గజ్వేల్ లో ఏం జరిగినా హైలెట్ అవుతోంది.