Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్
తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
Telangana Liquor Shops closed during Teacher MLC Election in state
తెలంగాణలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ 3 జిల్లాల్లో మద్యం దుకాణాలు (Wine Shops Closed for MLC Elections) మూతపడనున్నాయి. కాగా ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని, ఈ జిల్లాల్లో ఈ సమయంలో మద్యం విక్రయించరాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18, తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, ఫిబ్రవరి 23 వరకూ నామినేషన్లు స్వీకరించారు.
మార్చి 13న (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 16న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నది ఎన్నికల కమిషన్. కాగా, మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.