Telangana Liquor Shop Notification: తెలంగాణలో కొత్త లిక్కర్ షాపులకు నోటిఫికేషన్ - రిజర్వేషన్లు కూడా ఉన్నాయి - అప్లికేషన్ డీటైల్స్
Liquor Shops:తెలంగాణ లిక్కర్ షాప్ నోటిఫికేషన్ జారీ అయింది. అప్లికేషన్ పెట్టుకోవాలంటే నాన్ రిఫండబుల్ ఎమౌంట్ మూడు లక్షలు కట్టాల్సి ఉంటుంది.

Telangana Liquor Shop Notification Issued: తెలంగాణ ప్రభుత్వం 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం 2,620 రిటైల్ లిక్కర్ (A4) షాపులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటవుతాయి. అప్లికేషన్లు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు స్వీకరిస్తారు, లాటరీ అక్టోబర్ 23న జరుగనుంది. అప్లికేషన్ ఫీజు రూ. 3 లక్షలకు పెంచారు. కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్‌లకు అర్హత ఇవ్వడం, వాక్-ఇన్ స్టోర్‌లకు అదనపు ఫీజు వంటి మార్పులు చేశారు. ఈ నోటిఫికేషన్‌తో ప్రభుత్వం రూ. 6,500 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. గౌడ్, SC, ST కులాలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి.
కొత్తగా దుకాణాల సంఖ్య పెంచడం లేదు
తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆగస్టు 20న జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులకు లైసెన్స్‌లు ఇస్తారు. ఇప్పటి వరకూ ఉన్న దుకాణాలే. కొత్తగా దుకాణాలను పెంచలేదు. అయితే, అప్లికేషన్ ఫీజు మునుపటి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఒకే షాప్‌కు ఎన్నైనా అప్లికేషన్లు సమర్పించవచ్చు, కానీ ప్రతి అప్లికేషన్‌కు రూ. 3 లక్షలు చెల్లించాలి.
జిల్లాల్లో లాటరీ తీయనున్న కలెక్టర్లు
అలాట్‌మెంట్ ప్రక్రియ లాటరీ ద్వారా జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఈ లాటరీలను నిర్వహిస్తారు. అప్లికేషన్లు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు స్వీకరిస్తారు, విజేతలు అక్టోబర్ 23న ప్రకటిస్తారు. దుకాణానికి ఎవరూ అప్లయ్ చేయకపోతే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ లేదా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ఆ షాపులను నేరుగా నడపవచ్చు లేదా మళ్లీ నోటిఫై చేయవచ్చు.
గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ద్వారా దుకాణాలు
రిజర్వేషన్లు, అర్హతలు:
మొత్తం 2,620 షాపుల్లో గౌడ్ కులానికి 15 శాతం (సుమారు 393 షాపులు)
షెడ్యూల్డ్ కులాలు (SC): 10 శాతం (సుమారు 262 షాపులు)
షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST): 5 శాతం% (సుమారు 131 షాపులు)
మునుపటి లైసెన్స్‌లు ఉన్నవారు, కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్‌లు అప్లై చేయవచ్చు. రెటైల్ సేల్ ఎక్సైజ్ ట్యాక్స్ మునుపటివలెనే ఉంటుంది – హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రూ. 1.1 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ. 50 లక్షలు నుంచి రూ. 1.1 కోట్ల వరకు. వాక్-ఇన్ స్టోర్‌లు కొనసాగుతాయి. అదనపు రూ. 5 లక్షలు చెల్లించి షాపులను వాక్-ఇన్‌గా మార్చవచ్చు. ఇలాంటి స్టోర్‌లలో గ్లాసులు, కార్క్‌స్క్రూలు, ఐస్ బకెట్లు, ట్రేలు వంటి లిక్కర్ యాక్సెసరీలు విక్రయించవచ్చు. అన్ని షాపులు MRP ప్రకారమే విక్రయించాలి, దానికి విరుద్ధంగా చేస్తే తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్, 1968 ప్రకారం శిక్షిస్తారు. ఆసక్తిగలవారు excise.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.





















