జైలు నుంచి బయటకు రాజాసింగ్ - షరతులతో పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు నిర్ణయం
పీడీ యాక్ట్ కింద నిర్బంధంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు లో ఊరట లభించింది. పలు రకాల షరతులతో పీడీయాక్ట్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Bail For RajaSingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పీడీ యాక్ట్‌పై తన భర్తను అక్రమంగా జైల్లో నిర్బంధించారని రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనపై పీడీ యాక్ట్‌ను క్వాష్ చే్సతూ నిర్ణయం తీసుకుంది. అయితే పలు రకాల షరతులను విధఇంచింది. మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని హైకోర్టు షరతు విధించింది.
మునావర్ ఫారుఖీ షోకు వ్యతిరేకంగా వివాదాస్పద వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్
హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని రాజాసింగ్ పోరాటం చేశారు. ఆయన హిందువుల్ని కించ పరిచారని ఆరోపించారు. అయితే షో యధావిధిగా నడిచింది. దానికి కౌంటర్‌గా రాజాసింగ్.. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా వీడియో చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ అంశం తీవ్ర వివాదాస్పదమయింది. పోలీసులు మొదట కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు రిమాండ్‌కు పంపకుండానే బెయిల్ ఇచ్చింది. తర్వాత పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. అప్పటి నుండి జైల్లోనే ఉంటున్నారు. .
రాజాసింగ్ బెయిల్ కోసం న్యాయ సహాయం చేసిన రఘునందన్ రావు, రామచంద్రరావు
రాజాసింగ్‌పై వంద కేసులు ఉన్నాయని ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు కోర్టులో వాదించారు. అంతకు ముందు రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. తనపై పెట్టిన పీడీ యాక్టును ఎత్తేయాలని రాజాసింగ్ కమిటికి విజ్ఞప్తి చేశారు. విచారించిన కమిటీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేయడంతో .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన బయటకు వచ్చినా మీడియాతో మాట్లాడకూడదని షరతులు పెట్టడంతో బయట మాట్లాడటం.. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం వంటివి చేయకూడదు. రాజాసింగ్ జైలు నుంచి కూడా బయటకు వచ్చేందుకు న్యాయపరమైన సాయాన్ని బీజేపీ నేతలు చేశారు. రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడో.... రేపో సస్పెన్షన్‌ను ఎత్తి వేయనున్న బీజేపీ
రాజాసింగ్‌ను ఆయన సొంత పార్టీ బీజేపీ కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించకుండా ఉండటానికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాజాసింగ్ జైలు నుంచే వివరమ పంపారు. దీంతో రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడంతో ప్రజలు, హిందుత్వవాదులు, పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనకు హైకోర్టు పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం ప్రకటించడంతో రేపో మాపో బీజేపీ తన సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.