(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Revenue Dept: తెలంగాణలో ఎగబాకిన రెవెన్యూ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..
కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో నెల రోజుల క్రితం భూముల విలువను భారీగా పెంచిన ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర రెవెన్యూ శాఖ సంబంధిత ఛార్జీలను భారీ స్థాయిలో పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు, చిట్ ఫండ్‌లకు సంబంధించిన రుసుములను ప్రభుత్వం పెంచింది. పెరిగిన కొత్త ధరలన్నీ గురువారం (సెప్టెంబరు 2) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందించే వివిధ సేవలను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అందుకోసం ఛార్జీ రూ.500 చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ఆ ధర రూ.2 వేలకు పెరిగింది. సొసైటీల పత్రాల ఫైలింగ్‌కు గతంలో రూ.300 ఉన్న ఛార్జీలను ఇప్పుడు ఏకంగా రూ.వెయ్యి చేశారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా తాజాగా దీనికి కనిష్ఠం రూ.5 వేలుగా గరిష్ఠంగా రూ.లక్షగా నిర్ణయించారు.
వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలు, వీలునామా విచారణ, వీలునామా సీల్డ్ కవర్ డిపాజిట్, వీలునామా సీలు తెరవడం వంటి వాటికి రుసుమును రూ.5 వేలుగా పేర్కొన్నారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేసే ఛార్జీలు గతంలో రూ.వెయ్యి ఉండగా తాజాగా రూ.10 వేలకు ఎగబాకింది. ఐదుగురు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి అదనపు సభ్యుడికి మరో రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 75 ఏళ్ల పైబడి వృద్ధులకు ప్రైవేటు అటెండన్సీ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు. సర్టిఫైడ్ కాపీ, ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ)లకు గతంలో రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.500కు పెరిగింది. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌కు ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు. అంతేకాక, తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అమ్మమ్మ, నానమ్మ, మనుమలు, దత్తత తీసుకున్న కుమారుడు, లేదా కుమార్తె తదితరులను కుటుంబ సభ్యులుగా పేర్కొన్నారు.
Also Read: AP Telangana Breaking: వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు.. అన్న పక్కనే కూర్చున్న షర్మిల