Telangana: తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్! ఆ అలవెన్సులు అన్నీ పెంపు
ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్, సెలవు రోజుల్లో ఉద్యోగులకు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్ తో పాటు అనేక రకాల అలవెన్స్‌లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు మరో శుభవార్త అందింది. వారికి ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ఆర్థికశాఖ వెల్లడించింది. ట్రావెలింగ్ అండ్ కన్వేయన్స్, సెలవు రోజుల్లో ఉద్యోగులకు, ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్ తో పాటు అనేక రకాల అలవెన్స్‌లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
పెరిగే అలవెన్సులు ఇవీ..
ట్రాన్స్‌ఫర్ పైన వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలెవన్స్ కింద 30 శాతం, ట్రావెలింగ్ కన్వేయన్స్ అలవెన్స్ 30 శాతం, సెలవు రోజుల్లో పనిచేసే సాంకేతిక నిపుణులు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు రోజుకు అదనంగా రూ.150 చెల్లించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్ 30 శాతం గా నిర్ణయించారు. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వేయన్స్ అలవెన్స్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ లిమిట్ ఇంతకుముందు రూ.20 లక్షలుగా ఉండగా, తాజాగా దాన్ని రూ.30 లక్షలకు పెంచారు.
కారు కొనాలనుకుంటే అడ్వాన్స్ పరిమితి కూడా పెంపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కారు కొనుక్కోవాలనుకుంటే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. బైక్ విషయంలో అడ్వాన్స్‌ను 90 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంచారు. అదే కుమారుడి పెళ్లి అయితే అడ్వాన్స్ రూ.75 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.