Miryalaguda IT Raids: 'రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తే నాకేం సంబంధం' - ఐటీ సోదాలపై నల్లమోతు భాస్కరరావు సీరియస్ కామెంట్స్
Telangana Election 2023: తనపై ఐటీ దాడులు జరిగాయనేది పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
Nallamothu Bhaskararao Responds on Miryalaguda IT Raids: మిర్యాలగూడలో ఐటీ సోదాలపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు (Nallamothu Bhaskararao) స్పందించారు. వేములపల్లిలో (Vemulapally) ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తన ఇళ్లపై ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనను ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్స్ జరిగితే తనకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. తన బంధువులు, కుమారుల ఇళ్లల్లోనూ సోదాలు జరగట్లేదని పేర్కొన్నారు. తనపై ఐటీ సోదాలు (IT Raids) జరిగితే తానెందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని నిలదీశారు. తాను ప్రచారంలో బిజీగా ఉన్నానని ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. 'ఐటీ అధికారులు నన్ను కలవలేదు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయి. రైస్ మిల్లర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నాయి. నాకు ఎలాంటి కంపెనీలు లేవు. నా దగ్గర డబ్బులు లేవు. అలా ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే వెంటనే ఇచ్చేస్తా.' అని నల్లమోతు భాస్కరరావు వ్యాఖ్యానించారు.
ఐటీ సోదాల కలకలం
గురువారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు (Nallamothu Bhaskarrao) ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో, నల్గొండ, మిర్యాలగూడల్లోని (Miryalaguda) ఆయన బంధువులు నివాసాల్లో ఏకకాలంలో 40 బృందాలు దాడి చేసి సోదాలు చేస్తున్నారని సమాచారం. 30 బృందాలు ఒక్క నల్గొండలోనే దాడికి దిగినట్లు చెబుతున్నారు. నల్లమోతు భాస్కరరావుకు దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నట్లు తెలుస్తోంది. పలు పవర్ ప్లాంట్లలో ఆయన పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆయన భారీగా డబ్బులు నిల్వ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు సోదాలు చేపట్టారని వార్తలు వచ్చాయి.
బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు
నల్లమోతు బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు (IT Raids) సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బావమరిది రంగా శ్రీధర్ తో పాటు రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే, నల్గొండలోని రవీందర్ నగర్, పాతబస్తీ, మహేంద్ర ఆయిల్ మిల్ యజమానికి కందుకూరు మహేందర్ ఇంటితో ఆయనకు చెందిన రైస్ మిల్, మరో 7 చోట్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజాగా, దీనిపై స్పందించిన నల్లమోతు భాస్కరరావు అవి పుకార్లేనని, తనకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయనేది కేవలం అపోహేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, ఇలాంటి వదంతులు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చారు. తనను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.