(Source: ECI/ABP News/ABP Majha)
Delay in Yadadri Powerplant: 'యాదాద్రి' ప్రారంభంలో జాప్యం - కేంద్ర పర్యావరణ శాఖ తీరుపై రాష్ట్ర జెన్ కో అసంతృప్తి
Yadadri Powerplant: కేంద్ర పర్యావరణ శాఖ తీరుతో యాదాద్రి ప్లాంట్ ప్రారంభంలో జాప్యం నెలకొంటోంది. ఈసీ క్లియరెన్స్ కోసం జనవరి 31లోగా నివేదిక పంపాలన్న తాజా ఆదేశాలతో ఉత్పత్రి మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
Delay in Comissioning of Yadadri Powerplant: రాష్ట్రంలో యాదాద్రి విద్యుదుత్పత్రి కేంద్రం (వైటీపీపీ) ప్రారంభంలో జాప్యం నెలకొంది. వచ్చే డిసెంబర్ లోగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర జెన్ కో సన్నాహాలు చేసుకోగా కేంద్రం నిబంధనతో ఆ సమయంలోగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పర్యావరణ అనుమతి (ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ - ఈసీ) మంజూరు కోసం 2024, జనవరి 31లోగా నివేదిక పంపాలని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) జారీ చేసింది. దీంతో డిసెంబర్ లోపు విద్యుదుత్పత్రి సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఎందుకంటే జనవరి 31లోగా నివేదిక పంపితే ఫిబ్రవరి లేదా మార్చిలో కేంద్ర పర్యావరణ శాఖ ఈసీని జారీ చేసే అవకాశముంటుంది. ఈసీ వచ్చిన తర్వాతే ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభం సాధ్యమవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
స్వచ్ఛంద సంస్థ కేసుతో జాప్యం
యాదాద్రి ప్లాంట్ పనులు దాదాపు పూర్తైనందున డిసెంబర్ లో మొదటి, లేదా రెండో ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్ కో అధికారులు ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఈ కేంద్రం నిర్మాణం ప్రారంభానికి ముందే కేంద్ర పర్యావరణ శాఖ టీఓఆర్‌తో పాటు ఈసీని కూడా జారీ చేసింది. ఒకసారి పర్యావరణ అనుమతి జారీ అయిన తర్వాత ఏ కేంద్రానికి కూడా ఈసీ ఇవ్వమని మళ్లీ అడిగే అవసరం ఉండదని కేంద్ర అధికారులు తెలిపారు. అయితే, ఈ విద్యుదుత్పత్తి కేంద్రం అమ్రాబాద్ అభయారణ్యానికి దగ్గరగా ఉందని, దీని వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో కేసు వేసింది. దీంతో, 2023 జూన్‌లోగా మళ్లీ టీఓఆర్‌ను జారీ చేయాలని 2022 అక్టోబరులో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాప్యం నెలకొంటోంది.
స్పందన కరువు
పర్యావరణ శాఖ టీఓఆర్ జారీ చేసిన తర్వాత దానిపై అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ అధ్యయన నివేదిక ఇచ్చిన అనంతరం దాన్ని పరిశీలించి కేంద్ర పర్యావరణ శాఖ ఈసీ జారీ చేస్తుంది. ఎన్జీటీ నిర్దేశించిన ప్రకారం పర్యావరణ శాఖ 2023 జూన్‌లోగా అసలు టీఓఆర్‌నే జెన్‌కోకు ఇవ్వలేదు. దీనిపై అదనంగా మరో 3 నెలలు ఎదురుచూసినా స్పందన లేకపోవడంతో గత అక్టోబరులో జెన్‌కో ఎన్జీటీని ఆశ్రయించింది. ఈ క్రమంలో పర్యావరణ శాఖపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లోగా టీఓఆర్ జారీ చేయాలని ఆదేశాలిచ్చింది. సాధారణంగా టీఓఆర్ జారీ చేస్తే నెలలోగా నివేదిక ఇవ్వాలని పర్యావరణ శాఖ కోరుతుంది. యాదాద్రికి మాత్రం ఏకంగా 3 నెలల గడువు పెట్టడం తెలంగాణ జెన్‌కో ఇంజినీర్లను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ క్రమంలో ఈసీ జారీకి మార్చి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని ఇంజినీర్ అధికారులు అంచనా వేస్తున్నారు.
అదే లక్ష్యం
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మిస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని జెన్ కో చేపట్టింది. 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 5 యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబర్ 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర జెన్ కో ప్లాంట్ నిర్మాణం ప్రారంభించి, BHELకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తోన్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా మారనుంది. అక్టోబర్ నాటికి 2 యూనిట్ల పనులు పూర్తి కాగా విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read: Telangana Elections: ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు, తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు