Telangana Elections 2023: 'ఓటుకు రూ.10 వేలతో గెలవాలని చూస్తున్నారు' - సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Revanthreddy Comments on KCR: సీఎం కేసీఆర్ రైతుల భూములు దోచుకునేందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ ఓటుతో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.
Reavnthreddy Slams CM KCR in Bikkanur: తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూరులో (Bhikkanuru) కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు మళ్లీ ఓటేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనని, కేసీఆర్ కాలనాగు వంటి వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల భూములు మింగేందుకే కేసీఆర్ కామారెడ్డి (Kamareddy) వచ్చారని, రూ.200 కోట్లు ఖర్చు పెట్టి, రూ.2 వేల కోట్ల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మన భూములు మన చేతిలో ఉండాలంటే కేసీఆర్ గద్దె దిగాలని చెప్పారు. తెలంగాణను దోచుకున్న దొంగను ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నదాతల భూములు కాపాడేందుకు తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని వివరించారు. ఇవి కామారెడ్డి భవిష్యత్తు మార్చే ఎన్నికలని పునరుద్ఘాటించారు.
'కేసీఆర్ ఓట్ల కోసం మాత్రమే వస్తారు'
కామారెడ్డిలో గల్ఫ్, బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారని, పదేళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'ఆనాడు రైతుల కోసం కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ భిక్కనూరు వచ్చి మీకోసం కొట్లాడా. వడగండ్ల వాన పడితే సీఎం కేసీఆర్ రాలేదు. రైతు గుండె ఆగిపోతే చూడడానికీ రాలేదు. మాచారెడ్డి రైతు లిబయ్య సచివాలయం ముందు ఉరేసుకుని చనిపోతే ఆదుకోలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని కేసీఆర్, నేడు ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు. 40 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్నా కేసీఆర్ కు కోనాపూర్ గుర్తు రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం గుర్తుకొచ్చిందా.?' అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
'6 గ్యారెంటీలు అమలు'
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, వీటితో పాటు మేనిఫెస్టోలో పొందు పరిచిన హామీలను కూడా నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మార్పు కోసం కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు సూచించారు. గుంట భూమి కూడా గుంజుకోకుండా కంచె వేసి కాపాడుతానని చెప్పారు. 'ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షలు అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేలు అందిస్తాం' అని వివరించారు. గల్ఫ్ సంక్షేమ నిధి ద్వారా గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం
అంతకు ముందు, రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారం కోసం బయల్దేరుతుండగా, ఇలా జరగడంతో ఆయన రోడ్డు మార్గంలో కామారెడ్డి చేరుకున్నారు.