AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దాంతో డిసెంబర్ 1 నుంచి కొత్త లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు.

NTR Bharosa Pension | అమరావతి: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పథకాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల మంజూరుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వారికి కొత్తగా పెన్షన్లు ఆమోదించబడినట్లు అధికారిక సమాచారం. కొత్తగా ఎంపిక చేసిన 8,190 మందికి పెన్షన్ నగదు లబ్ధి చేకూరుతుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా మంజూరైన ఈ పెన్షన్లు లబ్ధిదారులకు అందనున్నాయి.
పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏలూరు జిల్లాలోని గోపాలపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం ₹2,738.71 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వం అధిక ప్రాధాన్యంతో నిధులను విడుదల చేస్తూ, అర్హులెవరూ పెన్షన్‌కు దూరం కాకుండా చర్యలు తీసుకుంటోంది.

పింఛన్ల పంపిణీపై సిబ్బందికి మార్గదర్శకాలు
పెన్షన్ల పంపిణీ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియలో లబ్ధిదారుల వివరాలు రియల్-టైమ్‌లో సేకరించడం, అనర్హుల జాబితా గుర్తించడం, కొత్త దరఖాస్తులను పరిశీలించడం మరియు బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ (NTR Bharosa Pension) కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలోని గోపినాధపట్నం గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలం, గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాడర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత, సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అమరావతికి తిరిగి చేరుకుంటారు.






















